సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన ధైర్యంతోనే హంట్ సినిమా చేసినట్లు ప్రముఖ హీరో సుధీర్ బాబు తెలిపారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు మాట్లాడారు. ఎవరూ చేయని ప్రయోగాలు చేశారని, ఆయన తన ధైర్యాన్ని కూడా ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు.


ఈ ఈవెంట్‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ, ‘కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళాక విడుదల అవుతున్న నా తొలి సినిమా 'హంట్'. ఇది నా తొలి ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం నాకు వెలితి. సినిమా విడుదలయ్యాక మార్నింగ్ షో తర్వాత కృష్ణ గారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్ అవుతా.’


‘కృష్ణ గారు వేల తారల్లో ఒక్కరిగా వెలిగిన సూర్యుడు. ఆయన ఒక కాగడాన్ని వెలిగించి వెళ్లిపోయారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని నడవాల్సిన బాధ్యత మా కుటుంబానిది, మన అందరిదీ. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు 'వెళ్లనివ్వాలా? వద్దా?' అని ఇంట్లో అందరికి కన్‌ఫ్యూజన్. కొందరు ముఖం మీద చెప్పేశారు. కృష్ణ గారు ఒక్క మాట అన్నారు... 'కష్టపడితే సక్సెస్ అవుతాడు. చెయ్యనివ్వండి' అని! అప్పటి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది. మంచి వేల్యూ వచ్చింది, రెస్పాక్ట్ వచ్చింది. ఇప్పుడు నా జీవితానికి అర్థం వచ్చింది.’


‘మంచి సినిమాలు చేశా. తెలుగు సినిమాల్లో నిలబడిపోయే కొన్ని సినిమాలు చేశా. ఇప్పుడు నా కెరీర్ స్టేబుల్ గా ఉందని ఈ మాట చెప్పడం లేదు. కృష్ణ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారు.’


‘ముందుగా ఈ మాటలు నేను నమ్మలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత 'నిజంగా అన్నారా?' అని అడిగా. అవునని చెప్పారు. వందల సినిమాలు చేసిన సూపర్ స్టార్ నా సినిమాలు చూడాలని ఎంచుకోవడం కంటే ఏం కావాలి. ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మల ఆయనకు రుణపడి ఉంటాను. కృష్ణగారు నాకు జ్ఞాపకాలు మాత్రమే ఇచ్చి వెళ్ళలేదు, ఆయనలో ధైర్యాన్ని కూడా ఇచ్చి వెళ్ళారు. ఆయన ఎవరూ చేయని ప్రయోగాలు చేశారు. ఆ ధైర్యంతోనే 'హంట్' సినిమా చేశా.’ అన్నారు.


సినిమా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ 'ఈ నెల 26వ తేదీన 'హంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. శ్రీకాంత్‌తో తొలిసారి అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. ఇక సుధీర్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా' అన్నారు. 


సీనియర్ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ 'దర్శకుడు మహేష్ వచ్చి రెండు గంటలు కథ చెప్పినప్పుడు వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. నేను హంట్ చేయడానికి భవ్య క్రియేషన్స్, సుధీర్ బాబు. నాకు సుధీర్ బాబు బ్రదర్ లాంటి వ్యక్తి. మంచి సినిమాలో నేను ఉండాలని చేశా. ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది.  సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. అర్జున్ ఎ, అర్జున్ బి మధ్య వేరియేషన్ తీసుకు రావడం ఈజీ కాదు. సుధీర్ బాబుకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఆనంద ప్రసాద్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు.' అన్నారు.