నిర్మాత బన్నీ వాస్ తన పేరును చేర్చుకున్నాడని, అలాగే తను కూడా బన్నీ వాస్ పేరును చేర్చుకోవాలని, తామిద్దరూ అంత క్లోజ్ అని అల్లు అర్జున్ అన్నారు. 18 పేజెస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొని మాట్లాడారు.


‘నా ఫేవరెట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. నా దర్శకుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి సుకుమార్ ఈ సినిమాకు నిర్మాత. సుకుమార్ లేకపోతే నా ప్రయాణం ఇలా ఉండేది కాదు. థ్యాంక్యూ సోమచ్ డార్లింగ్ (సుకుమార్). తనని అంత లవ్ చేస్తాను కాబట్టే తను నా సినిమా ఎంత లేట్ చేసినా అడగలేను. (నవ్వుతూ)’


‘నాకు దగ్గరైన ఇంకో వ్యక్తి వాసు. వాసుని నా ఫ్రెండ్ అనాలా, నా బ్రదర్ అనాలా, నా గైడ్ అనాలా, నన్ను రక్షించేవాడు అనాలా తెలియలేదు. తనకి నేనంటే ఎంత ఇష్టం అంటే తన పేరులో నా పేరు (బన్నీ) ఉంటుంది. తను నాకు ఎంత క్లోజ్ అంటే తన పేరు కూడా నా పేరులో పెట్టుకోవచ్చు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుంటే అది నాకు చాలా ముఖ్యమైన సినిమా. నేను తప్పితే ఎవరు వస్తారు ఈ సినిమాకి.’


‘మా నాన్న అల్లు అరవింద్‌కి ఆల్ ది బెస్ట్. సెట్స్ మీద సినిమా ఓటీటీలో రిలీజ్ చేయమని ఎన్ని ఆఫర్లు వస్తున్నా, తనకే సొంత ఓటీటీ ఉన్నా థియేటర్లకే సపోర్ట్ చేస్తాను అంటూ రిలీజ్ చేస్తున్న సినిమా మీద ప్రేమ ఉన్న నిర్మాతకి ఆల్ ది బెస్ట్.’


‘ఈ సినిమాకు గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మనం త్వరలో ఒక సినిమా చేద్దాం. (గోపీ సుందర్‌ని చూస్తూ). ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమాకు మెయిన్ సోల్ దర్శకుడు ప్రతాప్. తన గ్రాఫ్ అప్పట్నుంచి చూస్తున్నాను. అందరిలా త్వరగా సినిమాలు చేయకుండా, మంచి సినిమా ఇవ్వాలనే కోరికతో ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు.’


‘అనుపమ పరమేశ్వరన్‌కి ఆల్ ది బెస్ట్. కార్తికేయ-2కి గానూ నిఖిల్‌కు కంగ్రాట్యులేషన్స్. నేను కూడా నిఖిల్‌ను హ్యాపీ డేస్ టైం నుంచి చూస్తున్నాను. నలుగురు హీరోల్లో నాకు నచ్చింది తన పాత్రే. ఎన్నో మంచి సినిమాలు చేశాడు. నేను ఒక పార్టీలో నిఖిల్‌నే నేరుగా అడిగాను. ఇంత మంచి సినిమాలు ఎలా చేస్తావు అని. తను పుస్తకాలు చాలా చదువుతాడు. ఒక నటుడికి ఉండాల్సిన మంచి క్వాలిటీ చదవడం. అది చాలా మంచిది.’


‘ఇంతకుముందు దక్షిణాది సినిమాల పరిధి ఇక్కడి వరకే ఉండేది. రాజమౌళి లాంటి వారు మనకు ఒక రోడ్డు వేశారు. దాని మీదనే చాలా సినిమాలు సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లాయి. పుష్ప, కేజీయఫ్, కాంతార, కార్తికేయ-2 కూడా అందులో భాగం. ఇంకా చాలా సినిమాలు అలా వెళ్లాలి.’ అన్నారు.


ఆ తర్వాత పుష్ప గురించి మాట్లాడారు. ‘నేనెక్కువ చెప్పట్లేదు. అహంకారంతో చెప్పట్లేదు. పుష్ప-2 అస్సలు తగ్గేదేలే. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అభిమానులందరూ ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లండి.’ అంటూ ముగించారు.