ఆస్కార్స్ సందడి మొదలైంది. ఏ పాటకు అవార్డు రావచ్చు? ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో గుజరాతీ సినిమా 'చెల్లో షో'కు అవార్డు వస్తుందా? లేదంటే మన తెలుగు అమ్మాయి అపూర్వ గురు చరణ్ నిర్మించిన పాకిస్తాన్ సినిమా 'జాయ్ ల్యాండ్' కూడా ఆ విభాగంలో పోటీ పడుతోందట కదా, దానికి ఏమైనా అవార్డు వచ్చే అవకాశం ఉందా? అని చర్చ మొదలైంది.


'నాటు నాటు...' హ్యాపీ!
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' సాంగ్ అకాడమీ అవార్డ్స్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన పదిహేను పాటల్లో ఒకటిగా నిలిచింది. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో అది పోటీ పడుతోంది. నామినేషన్ వస్తుందా? లేదా? అనే సంగతి పక్కన పెడితే... ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది. 



అదేంటి? ఆల్రెడీ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాలో 'జయహో...' పాటకు ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు కదా? 'నాటు నాటు...' ఆస్కార్స్ షార్ట్ లిస్టు అయిన తొలి పాట అంటున్నారేంటి? అనే సందేహం కొందరికి రావచ్చు. అది ఇండియన్ కంపోజ్ చేసిన హిందీ సాంగ్ అయినప్పటికీ... హాలీవుడ్ సినిమాలోనిది. 'నాటు నాటు...' ఇండియన్ సినిమాలో సాంగ్. అదీ తేడా!


'నాటు నాటు...' షార్ట్ లిస్ట్ కావడం చాలా మంది సంతోషంగా ఉన్నారు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి వీరాభిమానులు కోరుకునేది ఇది కాదు. జక్కన్నకు నామినేషన్! నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను 'బెస్ట్ ఒరిజినల్ స్కోర్', 'బెస్ట్ సౌండ్ డిజైన్' విభాగాల్లో కూడా నామినేషన్ వస్తుందని చాలా మంది ఆశించారు. ఈ రోజు విడుదల చేసిన షార్ట్ లిస్టులో మన సినిమా పేరు లేదు. 


'ఆర్ఆర్ఆర్' విజువల్ ఎఫెక్ట్స్ గురించి హాలీవుడ్ విమర్శకులు చాలా మంది ప్రశంసించారు. ఆ కేటగిరీలోనూ 'ఆర్ఆర్ఆర్' పేరు లేదు. ఒకవేళ షార్ట్ లిస్టులో ఉన్నప్పటికీ... జేమ్స్ కామెరూన్ 'అవతార్ 2'కు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువల్ల, దాన్ని వదిలేశారు. ఇప్పుడు రాజమౌళికి ఆస్కార్ నామినేషన్ వస్తుందా? లేదా? అనే టెన్షన్ అభిమానులకు పట్టుకుంది. 


'అవతార్ 2', 'టాప్ గన్'తో పోటీ!
ఉత్తమ దర్శకుడు, సినిమా... రెండు కేటగిరీల్లో 'ఆర్ఆర్ఆర్' నిలిచే ఆస్కారం ఉందా? లేదా? జక్కన్నకు ఆస్కార్ అందుకునే ఆస్కారం ఎంత ఉంది? అని డిస్కషన్ జరుగుతోంది. ఒకవైపు పోటీలో 'అవతార్ 2'తో జేమ్స్ కామెరూన్, 'టాప్ గన్ : మావెరిక్'తో జోసెఫ్ కోసిన్స్కి ఉన్నారు.


శాటన్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' ఉత్తమ అంతర్జాతీయ సినిమాగా నిలిచింది కదా! ఆ పురస్కారాల్లో 'టాప్ గన్ : మావెరిక్'కు ఉత్తమ దర్శకుడిగా జోసెఫ్ అవార్డు సొంతం చేసుకున్నారు. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో 'ఉత్తమ సినిమా - నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్' విభాగంలో 'ఆర్ఆర్ఆర్'కు నామినేషన్ దక్కిందని సంబరపడ్డాం కదా! ఆ అవార్డుల్లో ఉత్తమ సినిమా (డ్రామా) విభాగంలో 'అవతార్ 2', 'టాప్ గన్' ఉన్నారు. ఇప్పుడు ఆ రెండూ ఆస్కార్స్‌కు నామినేట్ కావడం పక్కా.


Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
 
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా 'అవతార్ 2'కు జేమ్స్ కామెరూన్, 'ద ఫెబెల్ మన్స్' సినిమాకు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆస్కార్స్ నామినేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, రాజమౌళి ఛాన్స్ తక్కువ అని టాక్ వినబడుతోంది. హాలీవుడ్ సినిమాకు, అక్కడి లెజండరీ దర్శకుల పోటీని తట్టుకుని 'ఆర్ఆర్ఆర్' సినిమా, రాజమౌళి ఎంత వరకు నిలబడతారనేది పెద్ద ప్రశ్న. భారతీయ ప్రేక్షకుల్లో మెజారిటీ శాతం నామినేషన్స్ రావాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. 


Also Read : ఏపీలో రామ్ చరణ్ సుడిగాలి పర్యటన - ఎందుకంటే?