దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రానికి గానూ ఈ అవార్డు వరించింది. ఈ కార్యక్రమానికి జక్కన తన భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి వేడుకకు హాజరయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం జక్కన్న ఇచ్చిన స్పీచ్‌కు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు.
అవార్డు తీసుకున్న సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ఇప్పుడు దక్షిణాది నుంచి వస్తువున్న చిన్న సినిమాలను కూడా గుర్తించేలా చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇండియాలో RRR సినిమాకు ఎలా రియాక్ట్ అయ్యారో.. ఇక్కడ కూడా అలాంటి ఆదరణే లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులతో పాటు నా కుటుంబం కూడా ఒక కారణమే అన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు ఆస్కార్ వరిస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ అది నిరాశగానే ఉండిపోయింది. కానీ రాజమౌళికి ఈ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ జ్యూరీ నుంచి అవార్డు దక్కడం మాత్రం ఆస్కార్ గెలిచినంత ఆనందాన్నిస్తోందని, ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీసి సౌత్ ఇండియా సినిమాను అగ్రస్థానంలో ఉంచాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల ప్రత్యేకతలు ఏమిటీ?
ఇంతకీ ఈ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఏంటంటే... పేరులో న్యూయార్క్ ఉన్నంత మాత్రాన ఈ అవార్డులు అక్కడి సినిమాలకు ఇస్తారు అనుకోవడం పొరపాటే. ఈ అవార్డుల అసోసియేషన్ అమెరికాదే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో తమదైన ప్రతిభను చాటుకున్న దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లకు అవార్డులు ఇస్టుంటారు. ఈ అవార్డ్ అసోసియేషన్‌ను 1935లో స్థాపించారు. ఈ అసోసియేషన్‌లో న్యూయార్క్‌కి చెందిన పలు వార్తా పత్రికలకు చెందిన 30 మంది క్రిటిక్స్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తుంటారు. వారంతా కలిసి కొన్ని సినిమాలను ఎంపికచేసి ఏ సినిమాకు ఏ క్యాటగిరీలో అవార్డు ఇస్తే బాగుంటుందో చర్చించి అప్పుడు అవార్డులు ఇస్తుంటారు. దాదాపుగా ఆస్కార్ రేంజ్‌లోనే ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుంది. అలా ఈ అసోసియేషన్ నుంచి అవార్డు అందుకున్న మొదటి చిత్రం ‘ది ఇన్‌ఫార్మర్’. 1936లో ఈ సినిమాకు అవార్డు లభించింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే కాకుండా అమెరికాతో పాటు రష్యా, జపాన్‌లోనూ రికార్డులు కురిపించింది. ఇటీవల తారక్, రామ్ చరణ్ తమ ఫ్యామిలీతో కలిసి ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ షో కోసం జపాన్ కూడా వెళ్లారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇది ప్రపంచాన్ని చుట్టే ఓ అడ్వెంచరర్ కథ ఆధారంగా ఉంటుందని జక్కన్న హింట్ కూడా ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.