రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. దీంతో సినిమా బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇందులో భాగంగానే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్‌లు ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాతలు ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను కూడా హాజరయ్యారు.


తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లు నిర్వహించారు. దీంతోపాటు హిందీలో కపిల్ శర్మ షో, బిగ్ బాస్ షోలకు కూడా ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ హాజరయి సినిమాను విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా ముంబైలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయలేదు. త్వరలో దీన్ని టీవీల్లో ప్రసారం చేయనున్నారు.


జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్‌లతో పాటు సముద్ర ఖని, శ్రియ, ఒలీవియా మోరిస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.