షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే హీరో, హీరోయిన్లుగా జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్స్మ్ నిర్మించిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ టిక్కెట్ సేల్స్‌ లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే కోట్ల రూపాయలు కొల్లగొడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్ ఖాన్ సినిమాకు హిందీలోనే కాకుండా సౌత్ లో మంచి బిజినెస్ చేస్తోంది.    


రూ. 20 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్ బిజినెస్


కింగ్ ఖాన్ మూవీ టీజర్, బేషరమ్ పాట విడుదలైనప్పుడు ఓ రేంజిలో వివాదం తలెత్తింది. ఆ తర్వాత చిత్ర నిర్మాణ బృందం ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం భారత్ తో పాటు విదేశాల్లోనూ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ జోరుగా కొనసాగుతోంది.  ఇప్పటి వరకు, అడ్వాన్స్ బుకింగ్‌ లో అత్యధిక టిక్కెట్ విక్రయాలు రణబీర్ కపూర్  మూవీ ‘బ్రహ్మాస్త్ర’కు జరిగాయి. ఏకంగా ఈ మూవీ రూ. 19.66 కోట్లు సాధించింది. షారుఖ్ మూవీ జనవరి 23 వరకే అడ్వాన్స్ సేల్స్‌ లో రూ. 20 కోట్ల మార్కును దాటింది.  


ఇప్పటికే మిలియన్ కు పైగా టిక్కెట్ల అమ్మకం


ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ‘పఠాన్’ టిక్కెట్ విక్రయాలు భారీగా కొనసాగుతున్నాయి.  ఇప్పటికే మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, షారూఖ్ ఖాన్ మూవీ వస్తుండటంతో ముందస్తు అమ్మకాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఇప్పటికే బుక్‌ మై షోలో 1 మిలియన్ టిక్కెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. ‘పఠాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి 3500 స్క్రీన్‌లకు పైగా అందుబాటులో ఉన్నాయి.  


తొలి రోజు, ఉదయం 6 గంటలకు మొదటి ప్రదర్శన


ఈ సినిమా కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తొలిరోజు  ఉదయం 6 గంటలకే తొలి షో మొదలు కానుంది. ఉదయం 6 గంటలకు విడుదలయ్యే మొదటి షారుఖ్ ఖాన్ చిత్రంగా ‘పఠాన్’ రికార్డుల్లోకి ఎక్కనుంది. "జనవరి 25న విడుదలయ్యే ‘పఠాన్’ సినిమాను, PVR సినిమాస్ లో ఉదయం 6 గంటలకే తొలి షో వేస్తున్నాం. ఉదయం 6 గంటలకు ప్రదర్శింపబడే SRK తొలి చిత్రం ఇదేనని PVR సంస్థ వెల్లడించింది.   


పఠాన్’కు సౌత్ మంచి ఆదరణ   


‘పఠాన్’ తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సౌత్ లో ఈ చిత్రం టిక్కెట్ల అమ్మకం భారీగా పెరిగింది.  బుక్‌మైషో ప్రకారం, ‘పఠాన్’ తెలుగు వెర్షన్ హిందీ తర్వాత అత్యధిక అడ్వాన్స్ టిక్కెట్ విక్రయాలను కలిగి ఉంది. ముందస్తు టిక్కెట్ల విక్రయాలలో 30 శాతం సౌత్ నుంచి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో టిక్కెట్ల అమ్మకాల వేగం మరింత పుంజుకుంది.  


చెన్నై, హైదరాబాద్ లో SRK అభిమానుల సంబరాలు


చెన్నైలోని వుడ్‌ల్యాండ్స్ థియేటర్‌లో, షారూఖ్ ఖాన్  భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.  అజిత్, విజయ్ చిత్రాల మాదిరిగానే థియేటర్ల దగ్గర తొలి రోజున రికార్డు స్థాయిలో ప్రేక్షకులు కనిపించే అవకాశం ఉంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ‘పఠాన్’ విడుదలకు సిద్ధం కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులతో ఇటీవల సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో, ‘పఠాన్’ తెలుగు వెర్షన్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూడాలనుకుంటున్నారా? అని SRKని అడిగారు. రామ్ చరణ్ నన్ను తీసుకెళ్తే చూస్తానంటూ షారూఖ్  సమాధానమిచ్చాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో షారుఖ్ ‘పఠాన్’ తెలుగు వెర్షన్‌ను కూడా చూస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.  జనవరి 25న ఉదయం 6 గంటలకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో షారుఖ్ RAW ఏజెంట్‌గా నటిస్తున్నారు.






Read Also: షారుఖ్ ‘పఠాన్’కు అరుదైన గుర్తింపు, ఆ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే!