Senior Actor Chandra Mohan Daughter : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 11న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన అకాల మరణంపై అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా గురువారం (నవంబర్ 23) కుటుంబ సభ్యులు ఆయన 11వ రోజు సంతాప సభను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు, పాత్రికేయులు ఈ సంతాప సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ కూతురు మాధవి తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. "నాన్న కర్మయోగి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే అందులో మీకు చంద్రమోహన్ కనిపిస్తారు. అంతేకానీ అన్ని పనులు ఆపేసి నాకోసం రమ్మని ఏ రోజు చెప్పరు. ఈరోజు మీ పనులన్నిటిని వదిలిపెట్టుకొని కుటుంబ సభ్యుల్లాగా నాన్నగారి సంతాప సభకి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఎవరు రాలేదో వాళ్ళు ఆయన గురించి జోక్స్ వేసుకుంటూ, ఆయన గురించి ఒక్క మాట మాట్లాడినా అది ఆయనకు చూపించిన అభిమానం గానే మేము భావిస్తాం. నాన్నగారు నిర్మాతల ఆర్టిస్ట్ అని మీరందరూ ముందే మాట్లాడుకున్నారు. నిర్మాతకి ఇబ్బంది కలిగించి అన్ని ఆపేసి రమ్మని మా నాన్నగారు ఏరోజు చెప్పరు. ఈరోజు ఈ సంతాప సభకి వచ్చిన వాళ్లతో పాటు నాన్నగారిని తలుచుకున్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే. జీవితంలో ఎలా బ్రతకాలో నాన్నగారు మాకు చాలా నేర్పించారు. ఆయన లెగసి, ప్రిన్సిపుల్స్ ని నెక్స్ట్ తరానికి తీసుకెళ్లడం మా బాధ్యతగా భావిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు చంద్రమోహన్ కూతురు మాధవి.
కాగా చంద్రమోహన్ కి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. ఇక చంద్రమోహన్ విషయానికొస్తే..1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేసి సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా 1966లో రంగులరాట్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీఇచ్చారు.
తన సినీ కెరియర్లో సుమారు 900కు పైగా సినిమాల్లో నటించారు. కెరియర్ ఆరంభంలో శ్రీదేవి జయసుధ జయప్రద లాంటి స్టార్ హీరోయిన్స్ తోనే నటించారు చంద్రమోహన్, సుధ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. సుమారు 175 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన నటుడిగా రెండు ఫిలిం ఫేర్, ఆరు నంది అవార్డులు గెలుచుకున్నారు.
Also Read : కొన్నేళ్ల వరకు అలాంటి పాత్రలు చేయను, మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది - విజయ్ సేతుపతి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply