సంక్రాంతి బరి నుంచి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తప్పుకొన్నారు. తన సినిమా, పరశురామ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.‌ జనవరిలో కాకుండా... ఏప్రిల్ నెలలో 'సర్కారు వారి పాట' విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. దీపావళి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 


సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయాలని అనుకున్నారు.‌ రిలీజ్ డేట్ ప్రకటించారు కూడా! అప్పటికి 'ఆర్ఆర్ఆర్' సంక్రాంతి సీజన్ లో లేదు. పోయిన విజయదశమికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... ఉత్తర భారతదేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతికి వారం ముందు జనవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'కు భారీ సంఖ్యలో థియేటర్లు అవసరం అవుతాయి. రెండో వారం కూడా సినిమా ఆడితే తప్ప... బడ్జెట్ రికవరీ కావడం కష్టం.‌ 'ఆర్ఆర్ఆర్' విడుదలైన వారంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' థియేటర్లలోకి రానుంది. మహేష్ కూడా తన సినిమాతో వస్తే... 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల పై ప్రభావం ఉంటుంది. అందుకని, సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సిందిగా మహేష్ బాబును రాజమౌళి రిక్వెస్ట్ చేశారట. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేష్ హీరోగా రాజమౌళి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ తో మహేష్ సినిమాను వాయిదా వేశారు.


రాజమౌళి కోసం ఈ విధంగా మహేష్ త్యాగం చేయడం ఇది రెండోసారి.‌ గతంలో 'బాహుబలి' పార్ట్ వన్ కోసం 'శ్రీమంతుడు' విడుదల వాయిదా పడింది. మహేష్ బాబు, కొరటాల శివ కలయికలో తెరకెక్కిన 'శ్రీమంతుడు'ను తొలుత జూలై 17న విడుదల చేయాలని అనుకున్నారు. 'బాహుబలి'ని జూలై 10న విడుదల చేస్తున్నామని, రెండవ వారం తమకు థియేటర్ల దగ్గర వెసులుబాటు ఇవ్వాలని మహేష్ బాబును 'బాహుబలి' దర్శకనిర్మాతలు రాజమౌళి శోభు యార్లగడ్డ రిక్వెస్ట్ చేయడంతో... 'శ్రీమంతుడు'ను ఆగస్టు 7కు వాయిదా వేశారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి 'భీమ్లా నాయక్' కూడా వాయిదా పడే అవకాశం ఉందని వినిపించినా... తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ


Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి