గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘ది లెజెండ్’ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా కేవలం ఒక్క తమిళంలోనే కాకుండా దక్షిణాదిన సంచలనం సృష్టించింది. ఎందుకంటే తమిళనాడులో ఓ ప్రముఖ వ్యాపారవేత్త 53 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీపై అప్పట్లో విపరీతమైన చర్చ నడిచింది. ఈ సినిమా రిలీజ్ కు ముందునుంచే ఫుల్ పబ్లిసిటీ చేయడంతో మొదట్లో కాస్త నెగిటివ్ కామెంట్లు వచ్చినా తర్వాత పర్వాలేదనిపించింది. శరవణన్ సరసన హీరోయిన్ గా ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ సినిమా హీరో శరవణన్ పై అప్పట్లో కాస్త ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా విడుదల అయి చాలా రోజులు గడుస్తున్నా ఆ మూవీ ఓటీటీలో గానీ టీవీల్లో కానీ కనిపించలేదు. అయితే చాలా రోజుల తర్వాత ‘ది లెజెండ్’ సినిమాకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
‘ది లెజెండ్’ సినిమాకు జేడీ అండ్ జెర్రీ దర్శకత్వం వహించారు. అరుళ్ శరవణన్ హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ మూవీని దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. అయితే అందులో సగ భాగం కూడా వసూళ్లు తిరిగి రాలేదు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం దాదాపు ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ సినిమాను డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ ఈ సినిమాను మార్చి 3(శుక్రవారం) మధ్యాహ్నం నుంచే స్ట్రీమింగ్ ప్రారంభించింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. డాక్టర్ శరవణన్ వైద్య రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు డయాబెటిక్ కారణంగా చనిపోవడంతో దానిని నిర్మూలించడానికి మందు కనిపెట్టే పనిలో పడతాడు. అతని ప్రయత్నాలను మెడికల్ మాఫియా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో విలన్స్ అతన్ని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎలా దెబ్బతీస్తారు. శరవణన్ మాఫీయాపై ఎలా పగ తీర్చుకున్నాడు? తన లక్ష్యం ఎలా సాధించాడు? అనేది సినిమా స్టోరీ.
ఇక వత్తి రీత్యా వ్యాపారస్తుడైన శరవణన్ సినిమాలపై ఆసక్తితో హీరో గా మారారు. తన తండ్రి వ్యాపార వారసుడిగా మార్కెట్ లోకి వచ్చి తర్వాత మార్కెట్ లో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు శరవణన్. తర్వాత మోడల్ గా మారి తన వ్యాపారాలను తానే ప్రమోట్ చేసుకోవడం ప్రారంభించారు. అలా క్రమంగా తన ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆపై నటన లో శిక్షణ తీసుకున్న ఆయన తానే హీరోగా ‘ది లెజెండ్’ సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం శరవణన్ మరో సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారని టాక్. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా ఆయన హిట్ అందుకుంటారో లేదో చూడాలి.