నటుడు పంకజ్ శ్రీరంగం హీరోగా, దేవి శ్రీ హీరోయిన్ గా తెరకెక్కిన ‘సముద్రం చిట్టబ్బాయి’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మిర్యాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఫస్ట్ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమాను పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథగా చూపించనున్నామని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ లో కూడా అదే కనిపిస్తోంది. ఓ ఊరిలో చిట్టి అనే కుర్రాడు పక్క ఊరిలో ఉండే మధు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వెంట చాలా రోజులు తిరుగుతాడు. ఎట్టకేలకు ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడుతుంది. అయితే వారి ప్రేమకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తర్వాత హీరోకు తను ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది. ఆ అమ్మాయి కోసం చిట్టి ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాడు. నిజంగా మధు చిట్టిను వదిలేస్తుందా? లేదా ఎవరైనా దూరం చేస్తారా? చివరకు వాళ్లిద్దరూ కలుస్తారా లేదా అనేది సినిమాలో చూడాలి. ఆ సందిగ్దతను కొనసాగించేలా ట్రైలర్ లో ‘‘ఏ రాజ్యంలోనైనా రాణి లేకుండా రాజు ఉండడు, కానీ ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది’’ అనే డైలాగ్ తో ట్రైలర్ ను ముగించారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే రొటీన్ లవ్ స్టోరీ కథలానే కనిపించినా మొత్తంగా కొంచెం ఆసక్తిగానే అనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా మొత్తం వైజాగ్, తుని మధ్యలో గల బొడ్డవరంలో ఎక్కువ శాతం చిత్రీకరించారు. కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా, ఎన్నో ఎమోషన్స్‌ను తెరపై కనిపిస్తాయి. కుటుంబం, స్నేహితుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు కట్టిపడేసే సీన్స్ ఈ చిత్రంలో చాలానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే విడుదల వరకూ వేచి చూడాల్సిందే.
అంతే కాకుండా సినిమాలో అందరూ కొత్త నటీనటులే కావడం సినిమాలో కొత్తదనం కనిపిస్తోంది. ఇక దర్శకుడు మిర్యాల శివకు ఇది తొలి సినిమానే. హీరో పంకజ్ శ్రీరంగం కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా హీరోగా ఇదే ఆయన తొలి చిత్రం. పంకజ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న దేవి శ్రీ కూడా పలు సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలు, చెల్లి పాత్రల్లో నటించింది. హీరోయిన్ గా నటించడం ఇదే మొదటిసారి. వృత్తిరీత్యా దంత వైద్యుడైన డాక్టర్ ఫణి కుమార్ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. సాయి గాయత్రి తనయ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి నిజానీ అంజన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఈ సినిమా విడుదల కానుంది.