ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబరు 16)  పృథ్వీరాజ్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘సలార్’ టీమ్ ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.  పృథ్వీరాజ్ ఇందులో వరదరాజు మన్నారర్ పాత్రలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ ఇందులో ప్రతినాయకుడుగా నటిస్తున్నట్లు సమాచారం. గతంలో విడులైన ఫస్ట్ లుక్స్ తరహాలోనే.. పృథ్వీరాజ్ పోస్టర్ కూడా పూర్తిగా మసిగానే ఉంది. ముఖానికి మసి, ముక్కు పుడక, మెడలో కడియాలతో పృథ్వీరాజ్ గంభీరంగా కనిపిస్తున్నాడు. 






ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మరణించారు. దీంతో ప్రభాస్.. కొంతకాలంపాటు ఆయన షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి లేదనుకున్నారు. షూటింగ్ వాయిదా పడుతుందని అందరూ భావించారు. కానీ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం మొత్తం 12 సెట్లు వేశారు. ప్రతీ సెట్ లోనూ రెండు, మూడు రోజులు మాత్రం షూటింగ్ చేస్తారట. కానీ సెట్ లు వేయక తప్పలేదు. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


నో మొబైల్ ఫోన్ రూల్: జనాల్లో ఎగ్జైట్మెంట్ అలానే ఉంచాలని.. ఇకపై ఫొటోలు, వీడియోలు లీక్ అవ్వకుండా కొన్ని రూల్స్ పెట్టారు ప్రశాంత్ నీల్. షూటింగ్ లో పాల్గొనే ఎవరి దగ్గర కూడా ఫోన్ ఉండడానికి వీల్లేదని చెప్పారట. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ, వారి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా రూమ్స్ లో, క్యారవాన్స్ లో మొబైల్ ఫోన్స్ ను పెట్టిన తరువాత షూటింగ్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారట. ఇదివరకు రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 


రెండు భాగాలుగా షూటింగ్: ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. అందుకే, ఈ సినిమా లుక్స్ అన్నీ మసి పట్టినట్లుగా అందరి ముఖాలు డార్క్‌గా కనిపిస్తున్నాయి.