ఎంఎం కీరవాణి. తెలుగు సంగీద దర్శకుడు. అద్భుత స్వరకర్త. ఆయన సంగీత ప్రవాహంలో ఎన్నో మధురమైన పాటలు ఉద్భవించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు, ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మెంబర్ ఏఆర్ రెహమాన్ ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఎస్ ఎస్ రాజమౌళి ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కీరవాణి గురించి రెహమాన్ ఏమన్నారంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్.. కీరవాణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిజానికి ఎంఎం కీరవాణి గ్రేట్ కంపోజర్ అని చెప్పారు. కానీ, ఆయన అండర్ రేటెడ్ గా మిగిపోయారని వెల్లడించారు. తనకు తెలిసి కీరవాణి 2015లోనే రిటైర్ కావాలని భావించినట్లు వెల్లడించారు. అయితే, ఆయన అసలు కెరీర్ అప్పుడే మొదలైందన్నారు. తను ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారో అప్పుడే తన సంగీత గొప్పదనం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇప్పుడు ఆయన ప్రతిభ ఆస్కార్ స్టేజి వరకు చేరిందన్నారు. నా విద్యార్థులకు కూడా ఒకటే విషయాన్ని చెప్తాను. కీరవాణిని కేస్ స్టడీగా తీసుకోవాలని సూచిస్తానన్నారు. కెరీర్ ముగిసిపోయింది అనుకున్న తరుణంలో కొత్త ఆశలతో ఎలా విజృంభించే అవకాశం ఉంటుందో తనను చూస్తే తెలుస్తుందన్నారు.
అన్ని జానర్లలోనూ అద్భుత సంగీతం
వాస్తవానికి రెహమాన్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం. 1990లో ‘మనసు మమత’ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎం ఎం కీరవాణి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ అందించారు. ‘ఘరానా మొగుడు’ లాంటి మాస్ సాంగ్స్ అయినా, ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక గీతాలైనా, ‘ఎన్ కౌంటర్’ లాంటి విప్లవ పాటలైనా అద్భుతంగా కంపోజింగ్ అందించారు. ఇదీ, అదీ అని కాదు, అన్ని జానర్లలోనూ చక్కటి సంగీతం అందించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘నాటు నాటు’ పాట తప్పకుండా ఆస్కార్ అవార్డులు అందుకుంటుని రెహమాన్ తెలిపారు. అవార్డును అందుకునే అన్ని అర్హతలు ఆ పాటకు ఉన్నాయన్నారు.
‘RRR’ మూవీకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు
ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెల్చుకుంది. ఆ తర్వాత రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను సైతం పొందింది. ఇక ఆస్కార్ అవార్డు కోసం ‘RRR’ టీమ్ ఎదురు చూస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘RRR’ మూవీ సంచలనాలను నమోదు చేస్తోంది. భారతీయ సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోంది.
Read Also: సత్యదేవ్ హీరోగా పాన్ ఇండియా మూవీ, టైటిల్ భలే క్రేజీగా ఉందిగా!