'మా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు' అంటూ ఏడాది క్రితం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేసింది 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం. అలానే సినిమాలో రామ్ చరణ్ లుక్ ను రివీల్ చేస్తూ పలు పోస్టర్స్ ను విడుదల చేశారు. అందులో ఒక పోస్టర్ లో రామ్ చరణ్ తన కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లుని ఎక్కిపెట్టి కనిపించాడు. మరికొన్ని పోస్టర్స్ లో పోలీస్ యూనిఫామ్ లో కనిపించాడు. తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. 


ఈ నెల 9న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తుండడంతో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పోస్టర్ లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ పోస్టర్ ను వదలగా.. ఇప్పుడు రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో చరణ్ ఎంతో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. పలు కామెంట్స్ తో రామ్ చరణ్ ని తెగ పొగిడేస్తున్నారు. 


రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.