ఇప్పుడు మార్చి 25 అంటే 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' రిలీజ్ డేట్. ఆ మధ్య వెల్లడించినట్టు మార్చి 18, ఏప్రిల్ 28 కాకుండా మధ్యలో విడుదలకు రెడీ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటించడానికి ముందే ఆ డేట్ మీద మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' రాకతో ఆ సినిమా వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందింది. అందులో కొంత నిజం ఉంది.


'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడింది. అయితే... పూర్తిగా కాదు. మార్చి 25 నుంచి రవితేజ సినిమా పూర్తిగా తప్పుకోలేదు. కుదిరితే మార్చి 25న లేదంటే ఏప్రిల్ 15న సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఒకవేళ ఏ పరిస్థితుల కారణంగా అయినా 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడితే ఆ తేదీని మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నారేమో!? 'ఆర్ఆర్ఆర్' వస్తే వెనక్కి వెళ్లాలనేది ప్లాన్ గా తెలుస్తోంది.


"మా సినిమాపై మాకు ప్రేమ ఉంది. అలాగే, ఇతర సినిమాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న 'రామారావు ఆన్ డ్యూటీ'ని విడుదల చేయాలనుకున్నాం. కానీ, మారిన పరిస్థితులను బట్టి మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం" అని నిర్మాణ సంస్థలు నేడు ప్రకటించాయి.


శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'ని ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ అని యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా... సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.