టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, తన మేనేజర్ ఇక కలిసి పని చేయడం లేదనే అంశంపై ఇప్పటికే పలు కథనాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రష్మికకు తెలియకుండా ఆమె మేనేజర్ రూ.80 లక్షలు కాజేసినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దీనిపై రష్మిక స్పందించారు. తామిద్దరం కేవలం విడిగా పని చేయాలని నిర్ణయించుకున్నామని, తమకు ఎటువంటి విభేదాలు లేవని ప్రకటించారు.
‘మేం ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందం, అవగాహనతో కెరీర్‌లో విడివిడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్‌గా ఉండే వ్యక్తులం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడి విడిగా పని చేయాలని అనుకుంటున్నాం.’ అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.
మేనేజర్ చేతిలో మోసపోయిందని వార్తలు
ఇండస్ట్రీలో పని చేసే ప్రతి హీరో, హీరోయిన్లకు మేనేజర్లు ఉండటం సహజమే. వారి షూటింగ్ షెడ్యూల్స్, రెమ్యునరేషన్ లాంటి విషయాలన్నీ మేనేజర్లే దగ్గరుండి చూసుకుంటారు. అలాగే రష్మిక మందన్న దగ్గర కూడా ఓ మేనేజర్ ఉన్నాడు. రష్మిక ఇండస్ట్రీకు వచ్చినప్పటి నుంచీ అతనే మేనేజర్ గా చేస్తున్నాడు. ఇటీవల ఆ మేనేజర్ రష్మికకు తెలియకుండా రూ.80 లక్షలు ఆమె నుంచి కాజేశాడని, ఈ విషయం తెలుసుకున్న రష్మిక తనతో గొడవపడి అతన్ని పనిలోనుంచి తీసేసిందని వార్తలు వచ్చాయి. అడిగితే తానే ఇస్తానని, ఇలా నమ్మకద్రోహం చేయడం సరికాదని క్షణాల వ్యవధిలోనే అతన్ని పంపేసిందని పుకార్లు పుట్టాయి. దీన్ని ఇప్పుడు రష్మిక, తన మేనేజర్ ఇద్దరూ ఖండించారు.
ఇటీవలి కాలంలో రష్మిక మందన్న సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది. తన వ్యాఖ్యలతో కానీ లేదా ఆమె పై వచ్చే పుకార్లతో కానీ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుందీ కన్నడ బ్యూటీ. గతంలో కన్నడ చిత్ర పరిశ్రమ గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారమే రేపాయి. ఈ కామెంట్ల కారణంగా రష్మిక విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. అనంతరం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఇవి అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం భారతదేశంలోనే క్రేజీ ప్రాజెక్టు అయిన ‘పుష్ప 2’ సినిమాలో చేస్తుంది. ఈ చలన చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ముందు భాగంగా వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ దేశవ్యాప్తంగా భారీ హిట్ అందుకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ మంచి క్రేజీ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.