రష్మిక మందన్న సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే ఇటీవల రష్మికపై మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. కన్నడ పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందని, కన్నడ సినిమాల గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తోన్న ప్రచారం పై రష్మిక స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనపై కన్నడ లో ఎలాంటి బ్యాన్ విధించలేదని చెప్పింది. నిజానికి ‘కాంతార’ సినిమా విషయంలో కొంతమంది అత్యుత్సాహం చూపించారని, ఆ సినిమా విడుదల అయిన వెంటనే తాను చూడలేకపోయానని చెప్పింది. అయితే తర్వాత చూసి తాను యూనిట్ కు మెసేజ్ పెట్టానని పేర్కొంది. కానీ ఇవన్నీ ప్రేక్షకులకు తెలియవని చెప్పింది. వృత్తిపరంగా ఏం ఉన్నా అవన్నీ ప్రేక్షకులకు చెప్తానని, అది తన బాధ్యత అని చెప్పింది. అయితే తమ వ్యక్తిగత విషయాలను కెమేరా ముందు ఎలా బయటపెడతామని, అంత అవసరం కూడా లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అసలు వివాదం ఏమిటి ?


గతంలో రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో.. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన ‘కాంతార’ సినిమాను చూశారా అని యాంకర్ ప్రశ్నించగా.. లేదు చూడలేదు అని రష్మిక బదులిచ్చింది. నిజానికి రష్మికను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టినే. అలాంటిది ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాను చూడకపోవడం ఏంటని విమర్శలు రావడంతో ఈ వివాదం మొదలైంది. ‘కాంతార’ సినిమా చాలా బాగుందంటూ హీరో ప్రభాస్, సూపర్ స్టార్ రజనీ కాంత్ లాంటి వాళ్లు ప్రశంసిస్తుంటే.. సొంత ఇండస్ట్రీ నటి అయి ఉండి రష్మిక సినిమా చూడలేదు అని సమాధానం చెప్పడం ఏంటని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురింపించారు. తర్వాత రష్మిక ను కన్నడ నుంచి బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాాజాగా ఈ విషయం పై రష్మిక వివరణ ఇచ్చింది. 


హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది


రష్మిక హిందీ సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె హిందీలో అమితాబ్ బచ్చన్ తో నటించిన తొలి సినిమా ‘గుడ్ బై’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీలా పడింది. ఈ సినిమా తర్వాత మరో రెండు హిందీ చిత్రాల్లో నటించనుందీ బ్యూటీ. ప్రస్తుతం వీటిపైనే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రాలు విజయాన్ని అందుకుంటే బాలీవుడ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదంటే రష్మిక బాలీవుడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇక తమిళ్ లో రీసెంట్ గా నటించిన ‘వారిసు’ చిత్రం పై కూడా ఈ అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి ఈ మూవీకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఇక్కడ తెలుగులో కూడా రష్మిక చేతిలో ‘పుష్ప 2’ సినిమా ఒక్కటే ఉంది. 







Read Also: 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది తారల హవా, టాప్ 10లో ఆరుగురు మనోళ్లే!