సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించారు. 'శివ' సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తరువాత 'సర్కార్', 'సత్య' లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న వర్మ.. 'భూత్', 'కౌన్', 'పూంక్' తదితర చిత్రాలతో ప్రేక్షకులను అదే స్థాయిలో భయపెట్టాడు. అయితే గత కొంతకాలంగా ఆయన తన పద్ధతులు మార్చుకున్నారు. తన సినిమాల్లో కథ లేకపోయినా.. కాంట్రవర్సీ ఉండేలా చూసుకుంటున్నారు. మొదటినుండి కూడా వర్మ అంటే కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనే పేరుంది కానీ ఈ మధ్యకాలంలో మరీ పెరిగిపోయింది.
కాంట్రవర్సీనే తన సక్సెస్ ఫార్ములాగా చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్మ 'నేకెడ్', 'నేకెడ్ 2', 'క్లైమాక్స్' లాంటి సినిమాలతో అభిమానులకు షాక్ ఇచ్చారు.ఇవే కాదు.. ఆయన ప్రకటించే సినిమాలన్నీ కూడా ఏదొక విధంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. 'మర్డర్','దిశ ఎన్కౌంటర్' లాంటి సినిమాల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు వర్మ. త్వరలో భార్యలు అనే వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నారు.
''భరతముని, కేశవదాసు, జయదేవుడు, వనమాలి లాంటి ఇంకా ఎందరో శతాబ్దాల క్రిందటి మహానుభావులు.. లోకంలో ఎన్ని రకాల స్రీలు ఉన్నారో వాళ్ల వాళ్ల వర్గీకరణని సుధీర్ఘంగా విపులీకరించారు. కానీ, ఆ స్త్రీల అసలు స్వరూపం భార్యలుగా మారినప్పుడే బయటకొస్తుందని'' వర్మ అన్నారు.
''భార్య రావడం మూలంగా ఓ మనిషి జీవితం ఎలా మారిపోతుందో ఈ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పెళ్లి చేసుకోవడానికి ముందు కచ్చితంగా ఈ సిరీస్‌ని చూడాలి. భార్యలు వచ్చిన తర్వాత మగవాడి జీవితం ఎలా మారిపోతుందో ఈ సిరీస్ ద్వారా మీ అందరికీ తెలుస్తుంది'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఈ సిరీస్‌లో '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సిరీస్ కి 'రకరకాల భార్యలు' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించబోతున్నారు. ఈ సిరీస్ ను వర్మ తన స్పార్క్ ఓటీటీ కోసమే తెరకెక్కిస్తున్నట్లు ఉన్నారు. మరి ఈ భార్యల కాన్సెప్ట్ పై ఎంతమంది ఆడవాళ్లు కంప్లైంట్ చేస్తారో చూడాలి!