విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Telugu Movie). తమిళంలో అశోక్‌ సెల్వన్‌, 'గురు' ఫేమ్‌ రితికా సింగ్‌ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్‌ ఇది. ఒరిజినల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్‌ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విశ్వక్ సేన్‌కు జంటగా హీరోయిన్ మిథిలా పాల్కర్‌ (Mithila Palkar) నటించారు. 


తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మోడ్రన్ భగవంతుని పాత్ర ఒకటి ఉంటుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి ఆ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తున్నారు. 'లవ్ కోర్ట్'లో కేసులు పరిష్కరించే వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. దీనికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. 


''విశ్వక్‌సేన్‌.. ఏపీ, తెలంగాణాలో ఈ పేరు తెలియని వారుండరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ కొట్టారు. గల్లీ గల్లీలో అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడి సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను ఈయన పెర్సనాలిటీకి పెద్ద అభిమానిని. చెప్పిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడేవాళ్లంటే నాకు ఇష్టం. మాట మీద నిలబడతాననే పేరు నాకుంది. మంచో, తప్పో ఒక మాటిస్తే.. విశ్వక్ కూడా దానిపై నిలబడతాడని నేను విన్నాను. తను నమ్మినదాని కోసం, పక్కవాళ్ల కోసం నిలబడుతుంటాడు. ఇలానే నువ్ కంటిన్యూ చేస్తూ ఉండు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ రజనీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, చిరంజీవి లాంటి వాళ్లు ఆ స్థాయిలో ఉండడానికి.. వారి వ్యక్తిత్వమే కారణం. సినిమాలనేవి హిట్ అవుతాయి.. ప్లాప్ అవుతాయి. ఎల్లప్పుడూ సూపర్ స్టార్ గా ఉండాలంటే నీ పెర్సనాలిటీనే అక్కడికి తీసుకెళ్తుంది. అది నీకు నిండుగా ఉంది. 'రంగస్థలం' షూటింగ్ లో ఉండగా 'ఉప్పెన' ఫంక్షన్‌కు వచ్చా. అది రూ.100 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చా. ఇది కూడా అంత పెద్ద విజయం అందుకోవాలి'' అంటూ మాట్లాడారు చరణ్. 


విశ్వక్ సేన్ ను చరణ్ పొగడంతో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. హీరోగా విశ్వక్ సేన్ 6వ చిత్రమిది. వెంకటేష్, ఆయన కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చాయని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఇక 'ఓరి దేవుడా' సినిమా దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం డైలాగులు రాయగా.. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ఎడిట‌ర్‌గా విజ‌య్, సినిమాటోగ్రాఫ‌ర్‌గా విదు అయ్య‌న్న బాధ్యతలు నిర్వర్తించారు.


Also Read: 'మానాడు' రీమేక్‌లో రవితేజ - నెగెటివ్ రోల్ అంటే ఒప్పుకుంటారా?