'రొమాంటిక్' సినిమాతో హీరోగా ఆకాష్ పూరికి పెద్ద హిట్ కొట్టినట్టు ఉన్నాడు. సినిమా మీద కాన్ఫిడెన్స్ తో బుధవారం రాత్రి... విడుదలకు రెండు రోజుల ముందు పూరి జగన్నాథ్ ప్రీమియర్ షోలు వేశారు. ప్రముఖ దర్శకులు రాజమౌళి, గుణశేఖర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, కేఎస్ రవీంద్ర (బాబీ), మెహర్ రమేష్, నిర్మాతలు 'స్రవంతి' రవికిశోర్, బీవీఎస్ఎన్ ప్రసాద్, యువ హీరోలు విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ తదితరులు ప్రీమియర్ షోకి హాజరయ్యారు. సినిమా గురించి గొప్పగా చెప్పారు. పూరి జగన్నాథ్ కథ, మాటలతో పాటు ఆకాష్ పూరి నటన గురించి అందరూ మాట్లాడుతున్నారు.

 

సినిమా చూశాక... మీడియా ముందుకు రాజమౌళి వచ్చారు. అప్పుడు పూరి జగన్నాథ్ ఆయన దగ్గరకు రాగా, 'మీతో పని లేదు. ఆకాష్ తో' అని రాజమౌళి అన్నారు. ఆకాష్ పూరి వచ్చిన తర్వాత అతడిని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ "సినిమాలో ఏదైనా 'అదేంటి? అలా ఉంది?' అని చెప్పాలని వంక వెతుకుదాం అంటే... 'ముసలోడు అయిపోయావ్. నీకేం తెలుసు' అని యూత్ అంతా గొడవ పెడతారేమోనని భయంగా ఉంది. లెక్కలు వేసుకోకుండా తనకు ఏం అనిపిస్తుందో... దర్శకుడు అనిల్ పాదూరి సినిమా తీశాడు. ఆకాష్ పూరి బాల నటుడిగా బాగా చేశాడు. ఈ సినిమా ఒక లెవల్ దాటి చేశాడు. పతాక సన్నివేశాల్లో బాగా చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో ఫెంటాస్టిక్ యాక్టర్ వచ్చాడు. యంగ్ స్టర్స్ అందరికీ పండగ. మీ డబ్బుకు తగ్గ వినోదం వస్తుంది" అని అన్నారు.

 

"జగన్ (పూరి జగన్నాథ్) రాసిన డైలాగులు హీరోలు అందరూ చెబుతుంటే ఎంజాయ్ చేశాం. ఇప్పుడు వాళ్లబ్బాయి జగన్ మాటలు చెబుతుంటే... చూడటానికి, వినడానికి చాలా బావుంది. ఆకాష్ చాలా ఇంటెన్స్ తో వాళ్ల నాన్నగారు రాసిన క్యారెక్టర్ ను అర్థం చేసుకుని బాగా నటించాడు. సినిమా గ్రిప్పింగ్ గా ఉంది"

- దర్శకుడు గుణశేఖర్.

 

"దేశాన్ని ప్రేమిస్తే రూపాయి ఖర్చు ఉండదు. అమ్మాయిని ప్రేమిస్తే... బోల్డంత ఖర్చు' వంటి డైలాగ్ పూరి జగన్నాథ్ మాత్రమే రాస్తారు. టెర్రిఫిక్ లవ్ స్టోరీ. పతాక సన్నివేశాల్లో సీనియర్ ఆర్టిస్ట్ చేసినట్టు ఆకాష్ పూరి చేశాడు"

- హరీష్ శంకర్.



 

"ఆకాష్ స‌ర్‌ప్రైజ్‌ చేశాడు. ఆకాష్, కేతికాతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ఇటీవల కాలంలో చూసిన మోస్ట్ రొమాంటిక్ సినిమాల్లో 'రొమాంటిక్' ఒకటి. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి"

- వంశీ పైడిపల్లి.

 

"ఇప్పుడే సినిమా చూశా. ఒక్కటే మాట... ఇంటెన్స్ అండ్ రొమాంటిక్. డోంట్ మిస్. ముఖ్యంగా కుర్రాళ్లు అందరూ మార్నింగ్ షో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్లండి"

- అనిల్ రావిపూడి.



 


"నా బాల్యం నుంచి నేను పూరిగారి పెద్ద అభిమానిని. ఆకాష్ ఆయన పేరు నిలబెట్టే పెద్ద హీరో అవుతాడు"

- హీరో విశ్వక్ సేన్.