‘మా’ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ షూటింగులో చేతికి గాయం కావడంతో ప్రకాశ్ రాజ్ హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మంగళవారం ఉదయం ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మరోసారి ‘మా’లో కాకరేపుతోంది.
చేతికి కట్టుతో ఉన్న ప్రకాశ్ రాజ్ చిరంజీవితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘ఉదయం జిమ్‌లో బాస్‌ను కలిశాను. సినిమా శ్రామికుల సమస్యలను పరిష్కరించేందుకు చిరు తీసుకుంటున్న చొరవకు ధన్యవాదాలు. ‘అన్నయ్య’ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆయన మనకు దక్కడం మన అదృష్టం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఉందనే స్పష్టమవుతోందని పలువురు అంటున్నారు.
తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లో కింది పడ్డారు. చేతికి బలమైన గాయం కావడంతో సర్జరీ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం (ఆగస్టు 16) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు వైద్యం అందించిన ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘‘నా స్నేహితుడు ప్రకాశ్ రాజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని తెలుపుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే ఆయన్ని మళ్లీ వెండితెరపై చూడాలి’’ అని ట్వీట్ చేశారు.
మంగళవారం ఉదయం ప్రకాశ్ రాజ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయన్ని జిమ్‌లో కలిసి కాసేపు మంతనాలు జరిపారు. ‘మా’ ఎన్నికలు నిర్వహించాలంటూ చిరంజీవి లేఖ రాసిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఆయన్ని అభినందిచినట్లు తెలిసింది. చిరు-ప్రకాశ్ రాజ్‌ల మీటింగ్.. ఇప్పుడు ‘మా’లోని ఓ వర్గాన్ని కలవర పెడుతున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ‘మా’లో ఓ వర్గం ఎన్నికలు లేకుండా నరేష్‌నే అధ్యక్షుడిగా కొనసాగించాలని చెబుతుంటే.. మరో వర్గం హీరో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.
Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?
ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ సమస్యలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా, లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?