బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలలో నటించిన, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం 'పఠాన్'.. ఇటీవలే రిలీజై .. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత, మైత్రి ప్రొడక్షన్ లో యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ కోసం తెలుగు స్టార్ ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాడంటూ గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా సిద్ధార్థ్- ప్రభాస్ కాంబో ఇప్పట్లో కుదిరేలా లేదని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఇంతకు ముందు మైత్రి మూవీస్ తో రూ.65కోట్లకు సంతకం చేసిన ఒప్పందాన్ని కూడా ఇటీవలే రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీని నిలిపివేసినట్టు వస్తోన్న టాక్ కు మరింత ఆజ్యం పోసేదిలా ఉంది. 


ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి టీమ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రస్తుతం ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయిన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా కోసం అడ్వాన్స్ గా పొందిన మొత్తాన్ని కూడా సిద్దార్థ్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలోనే అత్యంత బిజీగా ఉండే వారిలో ప్రభాస్, సిద్దార్థ్ లు ఒకరు. ప్రస్తుత ప్రభాస్ చేతిలో మూడు సినిమాలుండగా.. సిద్ధార్థ్ 'ఫైటర్', 'టైగర్ వర్సెస్ పఠాన్' లతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఇప్పటికే  'టైగర్ v/s పఠాన్' తర్వాత.. 'ఫైటర్ 2' ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ప్రభాస్, ఇటు సిద్దార్థ్ లకు డేట్స్ కుదరకపోవడం, ఖాళీగా లేకపోవడం వల్ల వీరిద్దరి కాంబో సెట్ కావటం లేదని, అందుకే ఈ వీరి కాంబినేషన్లో మూవీ నిలిచిపోయిందని తెలుస్తోంది.


ప్రభాస్ రాబోయే సినిమాలు


ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' చిత్రంతో బిజీగా ఉండగా.. ఈ సినిమా జూన్ 16న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముందు నుంచీ అడ్డంకులు, వివాదాలే ఎదురవుతున్నాయి. సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ పైనా వివిధ విమర్శలు రావడంతో మేకర్స్ మరోసారి విజువల్స్ ఎఫెక్స్ట్ మార్పుపై దృష్టి సారించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 9 రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఓ రోజు ముందుగానే ఫ్యాన్స్ కోసం త్రీడీ ట్రైలర్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు టాక్ కూడా వస్తోంది. ఆదిపురుష్ ట్రైలర్ చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఈ మూవీ టీంను ప్రశంసిస్తూ ఇటీవలే ట్వీట్ కూడా చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ చూడడం ఆనందంగా ఉందని, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పారు, శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూపుతుందన్న ఆయన.. ఈ సినిమాలోని పాత్రలకు నటీనటులంతా జీవం పోశారని ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో పాటు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సాలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. వీటితో పాటు 2024లో ప్రాజెక్ట్ K,రాజా డీలక్స్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.