Pawan Kalyan:  తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే...‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సహకారం అందిస్తున్న తెలంగాణ కేసీఆర్‌కు ధన్యవాదాలు. కేటీఆర్‌ను నేను రామ్ భాయ్ అని పిలుస్తాను. పిలవగానే వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు.’


‘నాకు సినిమా అన్నం పెట్టింది. ఇంత మంది అభిమానులను ఇచ్చింది. నాకు సినిమా తప్ప వేరే వృత్తి తెలియదు. తొలి ప్రేమ, ఖుషిలకు ఎంత బాధ్యతగా చేశానో... భీమ్లానాయక్‌కు అంతే బాధ్యతగా పనిచేశాను. చినబాబు, నాగవంశీ నా పొలిటికల్ షెడ్యూల్‌కు తగ్గట్లు షూటింగ్ చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఎక్కడో యూఎస్‌లో ఉంటూ... సినిమా మీద మక్కువతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి సాగర్ చంద్ర వచ్చారు.మొగిలయ్య లాంటి కళాకారులను పరిచయం చేసిన థమన్‌కు థ్యాంక్స్.’


‘అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే మడమ తిప్పని యుద్ధం ఈ సినిమా. అయ్యప్పనుం కోషియుం అనే మలయాళ సినిమాను ఎంతో అందంగా తెలుగుకు తగ్గట్లు రాసిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాలో డేనియల్ శేఖర్‌గా రానా అద్భుతంగా నటించారు. సంయుక్త మీనన్, నిత్య మీనన్ కూడా కష్టపడి పనిచేశారు. మిగతా నటీనటులు కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.’


‘అందరినీ ఆకట్టుకునేలా బలమైన విజువల్స్ వేసిన రవి కె.చంద్రన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు. ఈ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.’ అంటూ తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ ముగించారు.