రాకీ భాయ్... ఇప్పుడు ఇదొక పేరు కాదు, బ్రాండ్! 'కెజియఫ్' సినిమా, ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిన 'కెజియఫ్ 2' ఎంతటి విజయాలు సాధించాయో అందరికీ తెలుసు. ఆ రెండు సినిమాలతో కన్నడ స్టార్ కథానాయకుడు యశ్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు కొంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ (Nara Lokesh) ను ఆయన కలవడం సంచలనమైంది.
నారా లోకేష్ ఎందుకు కలిశారు!?
తెలుగు దేశం పార్టీ (టిడిపి) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యశ్ (KGF Star Yash) ఎందుకు కలిశారు? అనేది చర్చనీయాంశం అవుతోంది. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కర్ణాటకలో గౌడ సామాజిక వర్గం ఎక్కువ. అందువల్ల, ఈ ఇద్దరి భేటీలో రాజకీయ పరమైన అంశాలు వచ్చాయా? లేదంటే స్నేహపూర్వక భేటీనా? అని చర్చ జరుగుతోంది. సుమారు అరగంట పాటు వీళ్ళిద్దరి భేటీ సాగింది.
సుమలతకు మద్దతుగా యశ్ ప్రచారం
రాజకీయాల్లో యశ్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అలాగని, ఆయన రాజకీయాలకు దూరంగా కూడా లేరు. కన్నడ కథానాయకుడు అంబరీష్ మరణించినప్పుడు... ఆయన సతీమణి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన సీనియర్ కథానాయిక సుమలత కర్ణాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆమెకు మద్దతుగా కొంత మంది కన్నడ హీరోలు ప్రచారం చేశారు. అందులో యశ్ కూడా ఉన్నారు.
'కెజియఫ్ 2' తర్వాత ఏంటి?
సినిమాలకు వస్తే... 'కెజియఫ్ 2' తర్వాత యశ్ మరో సినిమా అంగీకరించలేదు. 'కెజియఫ్ 3' అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం పడుతుందని యశ్ చెప్పారు. ఆ సినిమా పక్కన పెడితే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యశ్ కథానాయకులుగా ఒక క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా ప్లానింగ్‌లో ఉందా? 'కెజియఫ్ 3'లో ప్రభాస్, కన్నడ కథానాయకుడు మురళీ కూడా కనిపిస్తారా?ఆ మధ్య హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
Also Read : ఇండియాలో 'అవతార్ 2' కలెక్షన్లు - 17 కోట్లలో 6 కోట్లు తెలుగు ప్రేక్షకుల డబ్బే
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు చేస్తూ వస్తున్నారని ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ బలమైన ప్రచారం జరుగుతోంది. యశ్ హీరోగా ఆయన రూపొందించిన 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' భారీ ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'కెజియఫ్ 2' విడుదలైన తర్వాత... ఆ సినిమాకు 'సలార్' కథకు లింక్ ఉందనే మాటలు వినిపించాయి.
'కెజియఫ్ 2'లో ఈశ్వరీ రావు కుమారుడిగా కనిపించిన అబ్బాయి పేరు సలార్. అతడు పెద్దయ్యాక ప్రభాస్ అవుతాడనేది టాక్. సలార్ (ప్రభాస్) ఆర్మీ సాయంతో పార్లమెంట్ మీద రాఖీ భాయ్ ఎటాక్ చేశాడనేది కొంత మంది ఊహ. ఇప్పుడు విజయ్ కిరగందూర్ చెప్పిన మాటలకు వస్తే... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ''మేం 'కెజియఫ్ 3'ను మార్వెల్ యూనివర్స్ తరహాలో డిజైన్ చేసుకున్నాం. వివిధ చిత్రాల్లో హీరోలు ఇందులో భాగస్వామ్యులు అవుతారు. 'డాక్టర్ స్ట్రేంజ్', 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్లు ఒక సినిమాలో కలిసినట్టు... ఈ సినిమాలోనూ వివిధ సినిమాల్లో హీరోలు కలుస్తారు'' అని చెప్పారు.
విజయ్ కిరగందూర్ ఇంటర్వ్యూ తర్వాత... 'కెజియఫ్ 3' సినిమా యశ్, ప్రభాస్ చేయబోయే మల్టీస్టారర్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అన్నట్టు... 'సలార్' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 'కెజియఫ్ 3' స్టార్ట్ చేసి, 2024లో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.