గత కొన్నేళ్లగా ఓటీటీల హవా జోరుగా సాగుతోంది. సినిమా థియేటర్లతో పోటీగా కొత్త కంటెంట్ ను ప్రోత్సహించడంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ముందుంటున్నాయి. థియేటర్లతో పోల్చితే ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మేకర్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త కంటెంట్ ను రెడీ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘మాయా బజార్ ఫర్ సేల్’ అనే  తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే కుటుంబాల కథలను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించారు మేకర్స్.


ఫుల్ ఫన్నీగా ‘మాయా బజార్ ఫర్ సేల్’ ట్రైలర్


‘మాయా బజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు నరేష్, ఈషా రెబ్బ, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. జీ5తో పాటు రానా ద‌గ్గుబాటికి చెందిన  స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ దీనిని రూపొందించారు. చక్కటి కామెడీ, అంతకు మించిన డ్రామాగా ‘మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌’ తెరకెక్కింది. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫుల్ ఫన్నీగా కొనసాగింది.   



‘మాయా బజార్ ఫర్ సేల్’ కథ ఏంటంటే?


మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటీలో నరేష్ ఒక విల్లా తీసుకుంటాడు. నరేష్ కూతురు ఈషా రెబ్బ నటించింది. ఆమెకు త్వరగా పెళ్లి చేసి పంపించాలి అనుకుంటాడు. ఇందుకోసం ఆయనకు ఉన్న ఆస్తి అంతా అమ్మి మాయాబజార్ లో విల్లా తీసుకుంటాడు. ఆ మాయాబజార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నవదీప్ వ్యవహరిస్తాడు. కమ్యూనిటీలో ఉన్న ఇతర కుటుంబాల్లోని జంటలు ఎలా ఉంటారు అనేది ట్రైలర్ లో చూపించారు.  అంతా హ్యాపీగా గడిచిపోతుంది అనుకున్న సమయంలోనే అసలు విషయం మొదలవుతుంది.  ఆ గేటెడ్ కమ్యూనిటీ ఆక్రమణ స్థలంలో కట్టారని తెలుస్తోంది. అధికారుల ఆ గేటెడ్ కమ్యూనిటీలోని వారికి నోటీసులు ఇవ్వడంతో నవదీప్ తో పాటు నరేష్ నానా ఇబ్బందులు పడతారు. నవదీప్ హీరోగానే ట్రైలర్ లో కనిపించాడు. తన బ్రాండ్ ని మీడియా ముందు పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తాడు. మరోవైపు లక్షల రూపాయలు పోసి ఫ్లాట్లు కొన్న వారు ఆందోళన చెందుతారు. ఆ విల్లాను కూల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయి. ఆ ఇల్లుని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి నరేష్ కుటుంబంతో పాటు ఇతరులు ప్రయత్నిస్తారు. చివరికి ఆ ఇల్లు నరేష్ సొంతం అవుతుందా? నవదీప్ ఆ చిక్కుల్లో నుంచి ఎలా బయటకు వస్తాడు? అసలు మాయా బజార్ ఏమవుతుంది? అనేది సిరీస్ లో చూపించనున్నారు. జూలై 14 నుంచి జీ5లో ‘మాయా బజార్ ఫర్ సేల్’  సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Read Also: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial