Vikkatakavi Series Trailer: తొలిసారి తెలంగాణ నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘వికట కవి’ అనే పేరుతో డిటెక్టివ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ట్రైలర్ ను విడుదల చేసింది.
ఆసక్తిరేపుతున్న ‘వికట కవి’ ట్రైలర్
‘వికట కవి’ ట్రైలర్ ఆద్యంతం ట్విస్టులతో ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి నల్లమల ప్రాంతం వరకు కొనసాగే ఈ ప్రయాణం ప్రేక్షకులలో మాంచి క్యూరియాసిటీ కలిగించింది. ప్రతి ట్విస్ట్ ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని పెంచింది. హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివే రామకృష్ణ అనే యువకుడు అంతు పట్టని విషయాలను సాల్వ్ చేస్తుంటాడు. అలాగే నల్లమల ప్రాంతంలోని అమరగిరి ప్రాంతాన్ని మూడు దశాబ్దాలుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. దాని వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకునేందుకు రామకృష్ణ ఆ ఊరికి వెళ్తాడు. తన తెలివితో ఆ శాపం వెనుకున్న నిజాలను బయటపెడతాడు. అయితే, ఈ జర్నీలో తనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని తట్టుకుని తను ఎలా నిలబడ్డాడు? ఈ శాపం వెనుకున్న అసలు నిజాలు ఏంటి? అనే అంశాలతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు.
తెలంగాణ యాసలో కొనసాగనున్న ‘వికటకవి’
‘వికట కవి’ వెబ్ సిరీస్ పూర్తిగా తెలంగాణ యాసలో కొనసాగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. అంతే కాదు... ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నారు. షోయబ్ సిద్ధికీ అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అటు నరేష్ అగస్త్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వైవిధ్యమైన నటనతో అలరిస్తున్నాడు. ‘మత్తువదలరా’ సినిమాతో ప్రేక్షకుల మరింత దగ్గరయ్యాడు. ‘కలి’, ‘మాయలో’, ‘కిస్మత్’, ‘మెన్ టూ’, ‘పంచతంత్రం’ సహా పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. మేఘా ఆకాష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు సాయి విష్ణుతో మూడు ముళ్లు వేయించుకుంది. వివాహం తర్వాత ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. ఈ ముద్దుగుమ్మ ‘లై’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘రాజ రాజ చోర’, ‘డియర్ మేఘ’, ‘రావణాసుర’ సహా పలు సినిమాల్లో నటించింది. తమిళంలోనూ హీరోయిన్ గా రాణిస్తోంది.
Read Also: ‘క’ ఓటీటీ రిలీజ్... అసలు విషయం చెప్పేసిన మేకర్స్, పుకార్లకు చెక్