జీ5 ఓటీటీలో తాజాగా విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'. జూన్ 26వ తేదీ మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ విడుదలకు ముందు ఈటీవీ విన్ ఓటీటీ ప్రతినిథులు, 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ సిరీస్ ఐడియాను ముందుగా జీ5 ఓటీటీలో ఒక బృందానికి వినిపించామని, ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రారంభించామని, తమ ఐడియా కాపీ చేసి 'విరాటపాలెం' సిరీస్ తీశారని ఆరోపణలు చేశారు. మాది 100 శాతం ఒరిజినల్...కోర్టులో ఉంది కనుక ఎక్కువ చెప్పను!విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్ తాజాగా విడుదలైందని, వీక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుందని, స్ట్రీమింగ్ నెంబర్స్ బావున్నాయని జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ తెలిపారు. ఆ తర్వాత వివాదం గురించి ఆవిడ స్పందించారు.
జీ సంస్థ ప్రారంభం నుంచి అనేక ఒరిజినల్స్ చేసిందని ఆవిడ వివరించారు. తెలుగులో తొలి కాప్ (పోలీస్ నేపథ్యంలో) సిరీస్ ('పులి మేక') చేసిన ఘనత జీ5ది అని అనురాధ వివరించారు. 'విరాటపాలెం' మీద వచ్చిన విమర్శల పట్ల ఆవిడ స్పందిస్తూ... ''కేసు కోర్టులో ఉంది గనుక ఎక్కువ మాట్లాడలేను. మాది 100% ఒరిజినల్ సిరీస్. రైటర్ దీప్తి సోదరుడు పోలీస్. పోలీస్ నేపథ్యంలో కథ రాయడానికి ఆవిడ పూర్తిగా అర్హురాలు'' అని చెప్పారు.
'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో అభిజ్ఞ వుతలూరు ప్రధాన పాత్రలో నటించగా... కానిస్టేబుల్ కనకంలో హీరోయిన్ వర్షా బొల్లమ్మ టైటిల్ రోల్ చేశారు. రెండిటిలోనూ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్. రెండు పల్లెటూర్ల నేపథ్యంలో తెరికెక్కినవే. ఆల్రెడీ విరాటపాలెం స్ట్రీమింగ్ అవుతోంది. కానిస్టేబుల్ కనకం గనక వస్తే రెండు చూసి ఎవరిది ఒరిజినల్ ఎవరిది కాపీ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది.