Best Thriller Movies On OTT: వింత జీవులను సృష్టించడం, వాటిపై సినిమాలను తెరకెక్కించడం హాలీవుడ్‌కు అలవాటే. అలాంటి ఎన్నో సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద హిట్లు అందుకున్నాయి. అలాంటి ఒక సినిమానే ‘ది వాచెర్స్’ (The Watchers). సినిమా మొత్తం థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగినా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఇటీవల ఓటీటీలో విడుదలయిన ఈ సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు.. దీనికి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.


కథ..


‘ది వాచెర్స్’ కథ విషయానికొస్తే.. జాన్ (అలిస్టర్ బ్రామ్మర్) అడవిలో పరిగెడుతూ ఉంటాడు. తను ఎంత పరిగెత్తినా తనకు 108 నెంబర్‌తో ఉన్న బోర్డే కనిపిస్తుంది. అదే సమయంలో ఒక వింత క్రియేచర్ జాన్ దగ్గరకు వచ్చి అతడిని లాక్కెళ్లిపోతుంది. కట్ చేస్తే.. మీనా (డకోటా ఫాన్నింగ్) ఒక పెట్ షాప్‌లో పనిచేస్తుంది. ఒక కస్టమర్‌కు గోల్డెన్ పారెట్ డెలివరీ చేయమని మీనాను పంపిస్తాడు ఓనర్. అది చాలా దూరమయినా కూడా వెళ్లడానికి మీనా ఒప్పుకుంటుంది. తను వెళ్తున్నప్పుడు ఒక అడవి మధ్యలోకి రాగానే మీనా కారు ఆగిపోతుంది. కారు దిగి ఎవరైనా ఉన్నారేమో అని చూసేలోపే తన కారు మాయమైపోతుంది. అడవిలోకి వెళ్లిన తర్వాత మీనాకు ఒక క్యాబిన్, అందులో ఒక ముసలావిడ కనిపిస్తుంది. భయంతో మీనా ఆ క్యాబిన్‌లోకి వెళ్తుంది.


ఆ క్యాబిన్‌లో నుంచి బయటకు కనిపించదు. రోజూ బయట ఉన్న వింత జీవులు తమను చూస్తూ ఉంటాయని, వాటిని వాచెర్స్ అని పిలుస్తామని మీనాకు చెప్తుంది ఆ ముసలావిడ. ఆ తర్వాత తనతో పాటు ఉన్న మరో ఇద్దరిని మీనాకు పరిచయం చేస్తుంది. ఆ ముసలావిడ పేరు మ్యాడలిన్ (ఆల్వెన్ ఫారీ), తనతో పాటు ఉన్న ఒక కుర్రాడి పేరు డ్యానియెల్ (ఒలివర్ ఫిన్నెగన్), మరో అమ్మాయి పేరు కియారా (జార్జినా క్యాంప్‌బెల్). అక్కడ ఏదో తేడాగా ఉందనుకొని మరుసటి రోజు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మీనా. కానీ మ్యాడలిన్ తనను వెంటాడి తిరిగి క్యాబిన్‌కు తీసుకొస్తుంది. ఆ తర్వాత వాచెర్స్ గురించి వారికి తెలిసిన సమాచారాన్ని మీనాకు అందిస్తారు ఆ ముగ్గురు. మ్యాడలిన్ మాటలను వినకుండా వాచెర్స్ ఉండే గోతిలోకి దిగి అక్కడి వస్తువులను తీసుకొస్తుంది మీనా. దీంతో వాచెర్స్‌కు కోపం వచ్చి క్యాబిన్‌పై దాడిచేస్తాయి. అప్పటినుంచి మీనా కూడా వాచెర్స్ అనేవి ఉన్నాయని నమ్మడం మొదలుపెడుతుంది.


వాచెర్స్ అనేవి ఒకప్పుడు ఫెయిరీల్లాగా ఉండేవని, ఇప్పుడు అవి మనిషి రూపంకి మారడానికి ప్రయత్నిస్తున్నాయని వాటి ఫ్లాష్‌బ్యాక్ గురించి అందరికీ చెప్తుంది మ్యాడలిన్. ఒకరోజు వాచెర్స్ అన్నీ క్యాబిన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు క్యాబిన్ కింద ఒక సొరంగం ఉందని డ్యానియెల్ కనిపెడతాడు. అక్కడ ఒక కంప్యూటర్ కూడా ఉంటుంది. ఆ కంప్యూటర్‌లో వాచెర్స్‌పై పరిశోధన చేయడానికి వచ్చిన సైంటిస్ట్ వీడియోలు ఉంటాయి. ఆ సైంటిస్ట్ చెప్పినదాని ప్రకారం అడవిలో నుంచి ఆ నలుగురు తప్పించుకుంటారు. ఆ తర్వాత సైంటిస్ట్ గురించి, తను చేసిన పరిశోధనల గురించి తెలుసుకోవడానికి తను పనిచేసిన యూనివర్సిటీకి వెళ్తుంది. అక్కడ తను కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.



క్లైమాక్స్‌లోనే ట్విస్టులు..


‘ది వాచెర్స్’ సినిమాలో ట్విస్టులన్నీ క్లైమాక్స్‌లోనే ఉంటాయి. సినిమా మొత్తం థ్రిల్లింగ్‌గా సాగించిన డైరెక్టర్ ఇషానా నైట్ శ్యామలన్.. క్లైమాక్స్‌లోనే బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఓటీటీలో విడుదలయిన ‘ది వాచెర్స్’ను అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ తీసుకొని చూడవచ్చు.


Also Read: వాళ్లంతా కుటుంబ సభ్యులను చంపి ఎందుకు ఆత్యహత్య చేసుకుంటున్నారు? ఆ ‘బొమ్మ’ వెనుక కథేంటీ?