దేశవ్యాప్తంగా సినీ అభిమానులు 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని సాధించింది ఈ చిత్రం. భారత  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి వినోదపు పన్ను మినహాయించారు. అస్సాం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు హాలిడే ప్రకటించింది.


బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.67.35 కోట్లను వసూలు చేసింది ఈ సినిమా. రెండు, మూడు రోజుల్లో వంద కోట్లను వసూలు చేయడం ఖాయమనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు కొందరు ప్రేక్షకులు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.


నిజానికి ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. 
ఈ మేరకు ఒప్పదం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న క్రేజ్ కారణంగా.. ఓటీటీ రిలీజ్ ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మేలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మే 6 నుంచి జీ5లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.