దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పుష్ప 2' ఓటీటీ స్ట్రీమింగ్ తాజాగా మొదలైంది. జనవరి 30న అంటే బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో 'పుష్ప'గాడు రూలింగ్ మొదలెట్టేశాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ రీలోడెడ్ వెర్షన్ ఇటీవల థియేటర్లలో రాగా, దాన్నే ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అయితే కేవలం రీలోడెడ్ వెర్షన్ తో మాత్రమే మేకర్స్ సరి పెట్టలేదు. దీనికి తోడు ఓటీటీ మూవీ లవర్స్ కోసం మరో సర్ప్రైజ్ ను కూడా వదిలారు.
రీలోడెడ్ వర్షన్, మరో సర్ప్రైజ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప 2'. సంక్రాంతికి ముందే ఈ మూవీ రూ. 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 17 నుంచి ఈ సినిమాకు మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసి 'పుష్ప 2' రిలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో మరోసారి కలెక్షన్స్ పుంజుకుని ఈ మూవీ రూ. 2000 కోట్ల మార్కును అందుకుందని రీసెంట్ గా వెల్లడించారు. ఇక ఓటీటీతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం 'పుష్ప 2' మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో అడుగు పెడుతుందని మైత్రి మూవీ నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే ఈ మూవీ రిలీజ్ అయ్యి 56 రోజుల టైం పూర్తి కావడంతో, 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'పుష్ప 2' మూవీ రీలోడెడ్ వెర్షన్ మొత్తం 3 గంటల 40 నిమిషాలు ఉంది. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ కోసం బోనస్ గా మరో 4 నిమిషాల సీన్లను అదనంగా యాడ్ చేసి, మొత్తం 3:44 గంటలు రన్ టైమ్ తో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
'పుష్ప 2' కథ ఇదే
'పుష్ప' ఫస్ట్ పార్ట్ లో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కూలిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి, ఏకంగా సిండికేట్ ను నడిపే లీడర్ గా మారతాడు పుష్పరాజ్. సెకండ్ పార్ట్ లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ తో మరింత వైరం పెరుగుతుంది. ఇక మరోవైపు పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరిస్తాడు. ఓవైపు 'పుష్ప' అంటే ఫైర్ అంటూ గడగడలాడిస్తూనే, మరోవైపు పెళ్ళానికి మాత్రం ఎదురు చెప్పడు. భర్త సీఎంతో కలిసి ఒక ఫోటో తీసుకుంటే చూడాలని ఉందని శ్రీవల్లి కోరుతుంది. దీంతో ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడుతో కలిసి పుష్ప సీఎం దగ్గరికి వెళ్లి ఫోటో అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీవల్లి కోరికను పుష్పరాజ్ ఎలా నెరవేర్చాడు? భన్వర్ సింగ్ షెకావత్ 'పుష్ప'ను ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి, పుష్పకీ మధ్య ఉన్న వైరం ఏంటి? తన ఫ్యామిలీకి పుష్ప ఈ పార్ట్ లో అయినా దగ్గరయ్యాడా ? అనేది తెరపై చూడాల్సిందే.
Also Read: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?