Vaani Kapoor's Mandala Murders OTT Streaming On Netflix: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు ఆడియోలోనూ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌కు గోపి పుత్రన్, మనన్ రావత్ దర్శకత్వం వహించగా... వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సిరీస్ నిర్మించగా... వాణి కపూర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. శతాబ్దాల కిందట ఉత్తరప్రదేశ్ చరణ్ దాస్ పూర్ పట్టణంలో జరిగే మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందగా ఆకట్టుకుంటోంది.
స్టోరీ ఏంటంటే?
మిస్టరీ, క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ అన్నీ అంశాలు కలగలిపి ఈ సిరీస్ రూపొందించారు. యూపీలో చరణ్ దాస్ పూర్ పట్టణంలో 1952లో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అడవికి దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో రుక్మిణి అనే మంత్రగత్తె తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో క్షుద్రపూజలు చేస్తుంటుంది. ఊర్లో ఎవరికైనా కోరికలు ఉంటే వారి బొటనవేలు ఓ పాత యంత్రంలో సమర్పిస్తే కోరికలు తీరుతాయని చెబుతుంటుంది. ఈమె మాటలు నమ్మిన చాలామంది గ్రామస్థులు అక్కడకు వెళ్లి బొటనవేలు సమర్పిస్తుంటారు.
ఆ తర్వాత చాలామంది గ్రామస్థులు కలిసికట్టుగా అడవి నుంచి మంత్రగత్తెను తరిమేస్తారు. ఇదే టైంలో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన విక్రమ్ (వైభవ్ రాజ్ గుప్తా) ఢిల్లీ వెళ్లి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కొన్ని కారణాలతో అతన్ని సస్పెండ్ చేస్తారు. దీంతో సొంతూరికి వస్తాడు. తన తమ్ముడు, పిన్నిని అడవికి తీసుకెళ్లిన తన తల్లి అదృశ్యం అయ్యిందని తెలుసుకుని వారిని వెతకడం ప్రారంభిస్తాడు. దీని కోసం తన ఫ్రెండ్ సాయం తీసుకుంటాడు.
అయితే, ఆ గ్రామంలో సుజయ్ - విజయ్ సోదరులు రౌడీయిజం చెలాయిస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి రావాలని యత్నిస్తుండగా అదే గ్రామంలో ఉన్న అనన్య (సుర్వీన్ చావ్లా) వారికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇదే టైంలో సుజయ్, విజయ్‌తో పాటు మరో యువకుడు దారుణ హత్యకు గురవుతారు. ముగ్గురి మృతదేహాలపై ఓ డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తాయి. ఈ మర్డర్స్ మిస్టరీని ఛేదించేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రియా థామస్ (వాణీ కపూర్) ఆ ఊరికి వస్తుంది. మరోవైపు విక్రమ్ కూడా ఈ మర్డర్స్ మిస్టరీ ఛేదించాలని చూస్తాడు. అసలు విక్రమ్ తల్లికి ఏమైంది. ఈ హత్యలకు ఊరి నుంచి గెంటేసిన మంత్రగత్తెకు ఏమైనా సంబంధం ఉందా? మృతదేహాలపై ఆ డిఫరెంట్ సింబల్స్‌కు అర్థం ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.