Akka Web Series Review - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
Akka Web Series Review In Telugu: కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన వెబ్ సిరీస్ 'అక్క'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

- కథ కొత్తగా మొదలైనా, చివరకు రొటీన్‌గా మారింది.
Netflix Web Series Akka Telugu Review: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'అక్క'. ఇందులో రాధికా ఆప్టే మరో ప్రధాన పాత్ర పోషించారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హిందీలో తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉంది?
కథ (Akka Web Series Story In Telugu): మలేమార్, హెర్కడి, పర్పెలాడీ... మూడు చోట్ల అధికారం, ఆధిపత్యం ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ మూడింటినీ కలిపి పెర్నూరు అంటారు. పెర్నూరును పాలించే మలేమార్, హెర్కడి, పర్పెలాడీ వంశ పెద్దలను 'అక్క' అంటారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు. కానీ పిల్లల్ని కంటారు. తమ వంశంలో జన్మించిన ఆడవాళ్ళను వారసురాళ్ళుగా ప్రకటిస్తారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా... పెర్నూరులో 'అక్క'లు చెప్పినదే వేదం. వాళ్ళు చేసినదే రాజ్యాంగం. సారా పాట నుంచి బంగారం స్మగ్లింగ్ వరకు వాళ్ళకు ఎదురు వచ్చేవాళ్ళు లేరు. ఈ తరుణంలో ముంబై నుంచి వచ్చిన రుద్ర (రాధికా ఆప్టే) పెర్నూరును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. 'అక్క'లను అంతం చేయాలని కంకణం కట్టుకుంటుంది. అసలు రుద్ర ఎవరు? 'అక్క'ల మీద ఆమెకు ఎందుకు అంట పగ? రుద్రకు మలేమార్ వారసురాలు భవాని (కీర్తి సురేష్) చెక్ పెట్టగలిగిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Akka Web Series Review In Telugu): వెండితెరపై, డిజిటల్ తెరపై గ్యాంగ్ వార్, మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన కథలను పదుల సంఖ్యలో మన ప్రేక్షకులు చూశారు. ఇప్పటి వరకు వచ్చిన ఆయా వెబ్ సిరీస్, సినిమాల్లో - మెజారిటీ కథల్లో ఆధిపత్యమంతా పురుషులదే. మాఫియా డాన్‌లుగా మగాళ్ళు కనిపించారు. హిందీ సినిమా 'గంగూబాయి కతియావాడి' వంటివి మినహాయింపు అని చెప్పవచ్చు. ఆ తరహా కథలకు స్పిన్ ఆఫ్ సిరీస్ 'అక్క' అని చెప్పవచ్చు.
'అక్క' వెబ్ సిరీస్ ప్రారంభం ఆకట్టుకుంటుంది. 'అక్క' వ్యవస్థతో పాటు క్యారెక్టర్లను పరిచయం చేయడం, ఆయా సన్నివేశాలను చూపించిన తీరు ఆసక్తిగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకు వెళ్ళారు. కథలోకి వెళ్ళిన తర్వాతే అసలు సమస్య మొదలైంది. మగాళ్ళ బదులు ఆడాళ్ళు కనిపిస్తారు. కానీ, కథలో కొత్తదనం అసలు కనిపించలేదు. ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేయడం - కథతో పాటు స్క్రీన్ ప్లేలో ట్విస్టులను కూడా ఇంతకు ముందు సిరీస్, సినిమాల్లో చూసినట్టు ఉంటుంది. ట్విస్టులే కాదు... సన్నివేశాలు సైతం రొటీన్ అనిపిస్తాయి. దాంతో ఆసక్తి సన్నగిల్లుతుంది.
కథకుడిగా కంటే దర్శకుడిగా ధర్మరాజ్ శెట్టి ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు. ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కించారు. ఇదొక పీరియాడిక్ స్టోరీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేయడం నుంచి మిగతా సన్నివేశాల్లో పీరియాడిక్ వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల లుక్స్ నుంచి క్యారెక్టరైజేషన్స్ వరకు బాగా డిజైన్ చేశారు. కథలోనూ కొత్తగా ఆలోచించి ఉంటే సిరీస్ మరొక విధంగా ఉండేది. పవర్ కోసం జరిగిన పోరులో, ఆయా సన్నివేశాల్లో జాన్ స్టీవార్ట్ ఏడూరి నేపథ్య సంగీతం బావుంది. సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా బావుంది.
భవానిగా కీర్తి సురేష్ తన బెస్ట్ ఇచ్చారు. అవసరమైనప్పుడు యాక్షన్ చేశారు. ఆ సీన్లకు అవసరమైన ఎగ్రెషన్ చూపించారు. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సన్నివేశాలను ఎంగేజింగ్‌గా మార్చారు. బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చూసిన ఆడియన్స్‌కు రాధికా ఆప్టే నటన కొత్తగా అనిపించదు. అయితే... ఆ పాత్రకు అవసరమైన మేరకు నటించారు. అతిథి పాత్ర శంకర్ చేసిన మహేష్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళు తక్కువ.
Akka Web Series Verdict In Telugu: కాన్సెప్ట్ పరంగా 'అక్క' కొత్తగా ఉంటుంది. కానీ సిరీస్ అంతటా ఆ కొత్తదనం లేదు. పెళ్ళి చేసుకోకుండా పిల్లల్ని కనడం, తమ వారసత్వాన్ని అమ్మాయిలు ఇవ్వడం, తమ వంశాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి, ఆధిపత్యానికి మహిళలు చేసే పోరాటం వంటివి ప్రారంభంలో ఆసక్తిగా అనిపించినా... చివరకు వచ్చేసరికి రొటీన్ రివేంజ్ డ్రామాగా మార్చేశారు. కీర్తి సురేష్ తన బెస్ట్ ఇచ్చారు. మహిళల కోణంలో పవర్ గేమ్ చూడాలని కోరుకునే వీక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
Also Read: 418 Movie Review - 418 రివ్యూ: చైత్ర సినిమా భయపెట్టిందా? ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















