Homebound OTT : ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ 'హోమ్ బౌండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Homebound OTT Platform : వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నామినేట్ అయిన ఇండియన్ మూవీ 'హోమ్ బౌండ్'. రిలీజ్‌కు ముందే ఎన్నో అవార్డులు సాధించిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Ishaan Khatter's Homebound OTT Release On Netflix : ఇండియా తరఫున వచ్చే ఏడాదికి ఆస్కార్ బరిలో నిలిచిన మూవీ 'హోమ్ బౌండ్'. 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో ఈ మూవీకి నామినేషన్ దక్కింది. సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అందరి ప్రశంసలు కూడా అందుకుంది.
బాలీవుడ్ యాక్టర్ ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా హీరోలుగా నటించిన 'హోమ్ బౌండ్' మూవీలో నయా అందాల తార జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. వీరితో పాటే రీమ్ షేక్, షాలినీ వత్సా, హర్షిక పరమార్, చందన్ కె ఆనంద్, శ్రీధర్ దూబే కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'A Friendship A Pandemic and A Death Beside the Highway' అంటూ బషారత్ పీర్ రాసిన ఆర్టికల్ ఆధారంగా నీరజ్ గేవాన్ 'హోమ్ బౌండ్' మూవీకి దర్శకత్వం వహించారు. ఉద్యోగాల్లో ఎదురయ్యే అసమానతలు, కరోనా కష్టాలు, కులం పేరుతో ఎదురయ్యే అవమానాలు, ప్రభుత్వం ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో ఓ సాధారణ యువకుడికి ఎదురయ్యే పరిణామాలను మూవీలో చాలా చక్కగా చూపించారు.
Also Read : ఓటీటీలోనూ ట్రెండింగ్ 'డ్యూడ్' - రెండు రోజుల్లోనే టాప్ ప్లేస్... ఎందులో చూడొచ్చో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
మొహ్మాద్ షోయబ్ అలీ (ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకరు ముస్లిం, మరొకరి ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో సమాజంలో అవమానాలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే గౌరవం సంపాదించుకోవచ్చని భావిస్తారు. పోలీస్ కానిస్టేబుల్ అయితే మరింత గౌరవం లభిస్తుందని రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాస్తారు. అయితే, ఫలితాలు రావడం లేట్ అవుతుంది.
దీంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు అలీ. మరోవైపు సుధా (జాన్వీ కపూర్) కోసం కాలేజీలో చేరతాడు చందన్. ఇదే టైంలో ఓ రీజన్‌తో ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి. తన ఉద్యోగం వదిలేసిన అలీ, కాలేజీ మానేసిన చందన్... సూరత్ వెళ్లి ఫ్యాక్టరీ పనిలో చేరతారు. అసలు వీరిద్దరి మధ్య గొడవేంటి? ఇద్దరి జీవితాల్లోనూ కరోనా ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఇద్దరూ అనుకున్నట్లుగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి గౌరవం సంపాదించారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















