Calling Sahasra : న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో సినిమాలు థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా విడుదలవుతున్నాయి. థియేటర్లలో కాకుండా న్యూ ఇయర్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి ఓటీటీల్లోనే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘కాలింగ్ సహస్ర’ కూడా ఒకటి. థ్రిల్లర్ జోనర్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు పోటీగా థియేటర్లలో విడుదలయ్యింది. కానీ వాటికి పోటీగా నిలబడలేక, కలెక్షన్స్ సాధించలేక ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.


సుడిగాలి సుధీర్‌గా ఫేమస్


‘జబర్దస్త్’ అనే స్టాండప్ కామెడీ షోలో ముందు కామెడియన్‌గా, తర్వాత టీమ్ లీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సుడిగాలి సుధీర్. కేవలం కామెడియన్‌గా మాత్రమే కాదు.. హోస్ట్‌గా, నటుడిగా, మెజీషియన్‌గా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. మల్టీ టాలెంటెడ్ అని ట్యాగ్ ఇస్తూ.. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు సుధీర్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. సుడిగాలి సుధీర్ అనే పేరుతో చాలా ఫేమస్ అయిపోయాడు. అలా మెల్లగా తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో ముందుగా తను హీరోగా నటించడానికి ఛాన్స్ ఇచ్చిన సినిమా ‘కాలింగ్ సహస్ర’. ఈ సినిమా ఎన్నో సంవత్సరాల క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్నా.. థియేటర్లలో విడుదల అవ్వడానికి మాత్రం సమయం పట్టింది. 


అమెజాన్ ప్రైమ్‌లోనే..


డిసెంబర్ 1న పలు భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా ‘కాలింగ్ సహస్ర’ థియేటర్లలో విడుదలయ్యింది. ‘యానిమల్’లాంటి హైప్ ఉన్న చిత్రం కూడా అదే రోజు విడుదల కావడంతో ‘కాలింగ్ సహస్ర’కు ఎంత ప్రమోషన్స్ చేసినా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు. కానీ చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది అంటూ పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సైలెంట్‌గా విడుదలయ్యింది. న్యూ ఇయర్ సందర్భంగా ‘కాలింగ్ సహస్ర’ మూవీని స్ట్రీమ్ చేయడం ప్రారంభించింది ప్రైమ్. దీంతో పాటు సుధీర్ హీరోగా నటించిన మునుపటి సినిమాల ఓటీటీ రైట్స్‌ను కూడా ఎక్కువగా అమెజాన్ ప్రైమే దక్కించుకుంది.


తరువాతి సినిమాలపై ఫోకస్..


అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ‘కాలింగ్ సహస్ర’లో సుడిగాలి సుధీర్‌కు జోడీగా డాలీ షా నటించింది. వారితో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివబాలాజీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా తెరకెక్కింది. విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వరులు కాటూరి.. ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. మోహిత్.. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తగినట్టుగా సంగీతాన్ని అందించాడు. ‘కాలింగ్ సహస్ర’ నిరాశపరిచినా.. అదేమీ పట్టించుకోకుండా తన తరువాతి సినిమాలపై దృష్టిపెట్టాడు సుధీర్. ప్రస్తుతం తను హీరోగా ‘గోట్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. తమిళ బ్యూటీ దివ్యభారతీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తూ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగానే విడుదల కానుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


Also Read: ఈ ఏడాది ఫస్ట్ వీక్ రిలీజ్ కానున్న మూవీస్ ఇవే - థియేటర్లో కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సందడి!