టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ పండుగే వేరు. అందులోనే సంక్రాంతి పండుగకు వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ కు డబుల్ బొనంజానే. చిరు, బాలయ్య క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎంతో శ్రద్ధగా సంగీతాన్ని అందించేవారు. అభిమానులతో స్టెప్పులు వేయించే సాంగ్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు కూడా వారి సినిమాల్లో తప్పకుండా ఉండేలా కంపోజ్ చేసేవారు. అందుకే ఒక్కోసారి సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాకున్నా పాటలు మాత్రం సూపర్ హిట్స్ గా ఉండేవి. అలా వారిద్దరూ సంక్రాంతికి పోటీ పడిన కొన్ని సందర్భాలు చూద్దాం. 

1999: స్నేహం కోసం vs సమర సింహా రెడ్డి 


90s కు గుడ్ బై చెబుతూ 1999 జనవరిలో 113 రోజులో గ్యాప్ లో రిలీజ్ అయిన సినిమాలు ‘స్నేహంకోసం’, ‘సమరసింహారెడ్డి’. జనవరి 1న రిలీజైన స్నేహం కోసం సూపర్ హిట్ అయితే సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయింది. అప్పటివరకూ సరైన హిట్స్ లేక కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకువెళ్లిన సినిమా సమరసింహారెడ్డి. స్నేహం కోసం సినిమాకు యస్.ఏ.రాజ్ కుమార్ అందించిన పాటల్లో "కైకలూరు కన్నెపిల్లా" పాట ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తే "మీసమున్న నేస్తమా" పాట క్లాసిక్ గా నిలిచింది . ఇక సమరసింహా రెడ్డి పాటలైతే.. ఆ ఏడు అతిపెద్ద బాక్సాఫీస్ బొనాంజాగా మారాయి. ప్రతీపాటా సూపర్ హిట్ కావడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. 

2000: అన్నయ్య vs  వంశోద్ధారకుడు
  


కొత్త మిలీనియంకు వెల్కమ్ చెబుతూ ఈ టాప్ స్టార్స్ ఇద్దరూ 2000 సంక్రాంతికి వారం రోజుల గ్యాప్‌లో ‘అన్నయ్య’, ‘వంశోద్ధారకుడు’ సినిమాలతో పోటీపడ్డారు. వీటిలో ‘అన్నయ్య’ హిట్ కాగా.. ‘వంశోద్ధారకుడు’ జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. ‘అన్నయ్య’ సినిమాకు మణిశర్మ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘‘ఆట కావాలా, పాట కావాలా సాంగ్’’ ఇప్పటికీ సూపర్ హిట్టే. అలాగే ‘‘వాన వల్లప్ప వల్లప్పా’’ సాంగ్, ‘‘హిమసీమల్లో’’ పాట కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక వంశోద్ధారకుడుకు కోటి అందించిన పాటల్లో బుడిబుడి చినుకుల  వానా.  గుడిగంటలు మోగే వేళా, కొండపల్లి బొమ్మ లాంటి పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి . 

 

2001: మృగరాజు vs నరసింహనాయుడు (మణిశర్మ నామ సంవత్సరం )


2001 సంక్రాంతికి  ఒకేరోజు చిరు ,బాలయ్య పోటీ పడ్డారు . జనవరి 11 న హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన చిరంజీవి మృగరాజు డిజాస్టర్ కాగా అదేరోజు రిలీజ్ అయిన  బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్ అయింది . అయితే టెక్నికల్ గా మృగరాజుకు మంచిమార్కులే పడ్డాయి . ఈ రెండు సినిమాల రిజల్ట్ పక్కన పెడితే మ్యూజికల్ గా రెండూ సూపర్ హిట్సే . మృగరాజు లో చిరంజీవి పాడిన ‘‘చాయ్ చటుక్కునా తాగారా భాయ్’’ పాట .. దానికి చిరంజీవి వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటే ‘‘శతమానం అన్నది లే పాట’’ చిరంజీవి సినిమాల్లోని బెస్ట్ మెలోడీ ల్లో ఒకటిగా చెబుతారు . ఇక  నరసింహనాయుడు అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది .  పాటలన్నీ సూపర్ హిట్ . ముఖ్యంగా ‘‘నిన్నా కుట్టేసినాది మొన్నా కుట్టేసినాది’’, ‘‘లక్స్ పాపా లక్స్ పాపా’’ సాంగ్స్ బాలయ్య అభిమానులకు ఎవర్ గ్రీన్ మాస్ హిట్స్ గా నిలిచిపోయాయి . పాటల సంగతి పక్కనబెడితే ఈ సినిమాలకు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచిపేరు వచ్చింది . 

 

కొసమెరుపు: ఆ ఏడాది సంక్రాంతికే మూడు రోజుల గ్యాప్ తో జనవరి 14న రిలీజ్ అయిన వెంకటేష్ ‘దేవీ పుత్రుడు’కు మణిశర్మే సంగీతం అందించారు . సినిమా రిజల్ట్ అబౌ ఏవరేజ్ అయినా ఆ సినిమాలో సాంగ్స్. బీజీఎమ్ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి . 

 

2004: అంజి vs లక్ష్మి నరసింహ : మళ్ళీ మణిశర్మే 


2004 సంక్రాంతికి చిరు, బాలయ్య లమధ్య అనుకోని వార్ వచ్చింది .  బాలయ్య  సినిమా  లక్ష్మి నరసింహ తోపాటు ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకున్నచిరంజీవి సినిమా ‘అంజి’ ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి . వీటిలో ‘లక్ష్మి నరసింహా’ హిట్ అయితే భారీ బడ్జెట్ కారణంగా ‘అంజి’ అనుకున్న స్థాయిలో ఆడలేదు . అయితే ‘అంజి’ సినిమాలో గ్రాఫిక్స్ కు చాలా మంచిపేరు వచ్చింది.  ఇక ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది మణి శర్మే కాగా రెండు సినిమాల పాటలకూ, బీజీయం కూ మంచి రెస్పాన్స్ వచ్చింది . 

 

2017: ఖైదీ నెంబర్ 150 vs గౌతమీ పుత్ర శాతకర్ణి : ఒకటి మాస్ మరొకటి క్లాసిక్ 

 

చిరు ,బాలయ్య లమధ్య సంక్రాంతి పోటీలో 2017 ది ప్రత్యేకమైన సంవత్సరం . ఖైదీ నెంబర్ 150 తో చిరంజీవి టాలీవుడ్ కి తన 150వ సినిమాతో  రీ ఎంట్రీ ఇస్తే ,తన కెరీర్లో 100 సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి తో బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఖైదీ నెంబర్ 150కి దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ గా ఆ సంక్రాంతికి నిలిచింది . రత్తాలూ రత్తాలూ , అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలు ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి . ఇక నీరు నీరు పాట అయితే మెలోడీ ప్రియులను ఆకట్టుకుంది . గౌతమీ పుత్ర శాత కర్ణికి చిరంతన్ భట్ అందించిన బీజీఎం, పాటలు ఆ సినిమా జోనర్ కు సరిగ్గా సరిపోయాయి. 

2023: వీర సింహ రెడ్డి vs వాల్తేర్ వీరయ్య: ఈ సారి ఆ మ్యాజిక్ ఏదయ్యా?


ఈ సంక్రాంతికి మళ్లీ ఒక రోజు గ్యాప్ లో పోటీ పడుతున్నారు ఈ సీనియర్ స్టార్స్ . సినిమా రిలీజ్ లకోసం ఫ్యాన్స్ తోపాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సమస్యల్లా మ్యూజిక్ కు వస్తున్న రెస్పాన్స్  తోనే.  చిరు సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ ఇవ్వగా బాలయ్య సినిమాకు థమన్ పాటలు అందించారు  . అయితే మాస్ ను ఆకట్టుకునే మ్యూజిక్  విషయంలో మాత్రం ఈ ఏడాది గత సందర్భాలలో పోలిస్తే ఈ టాప్ స్టార్స్ సినిమాలకు అనుకున్న స్థాయి పాటలు ఇవ్వలేదని స్వయంగా అభిమానులే విమర్శిస్తున్నారు.  వరుసగా సింగిల్స్ రిలీజ్ చేస్తూ వెళుతున్నా.. అవి  గతంలోలా చార్ట్ బస్టర్స్ కావడం లేదు అనేది వాస్తవం అని మ్యూజిక్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. కనీసం బీజీఎమ్‌లోనైనా..  ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తమ మ్యాజిక్ చూపుతారేమో చూడాలి.