బాహుబలి సూపర్ హిట్ అయిన అనంతరం నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’ అనే వెబ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘శివగామి’ పుస్తకాల ఆధారంగా ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించింది. శివగామి పాత్రకు మొదట మృనాల్ ఠాకూర్‌ను ఎంచుకుని కొన్నాళ్లు షూట్ చేశాక.. ఆ తర్వాత వామిక గబ్బిని ఎంచుకున్నారు.
రాజమౌళి పర్యవేక్షణలో తెలుగు దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవా కట్టాలు దర్శకులుగా కొంతభాగం షూట్ చేశాక.. అవుట్ పుట్ నచ్చకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ అప్పటి వరకు తీసిన ఫుటేజ్‌ను పక్కన పడేసింది. కునాల్ దేశ్‌ముఖ్, రిభు దేశ్‌గుప్తాలను దర్శకులుగా ఎంచుకుని ఆ తర్వాత కూడా కొన్నాళ్లు షూటింగ్ చేశారు.
ఆరు నెలల షూటింగ్ అనంతరం అవుట్‌పుట్ చూసిన నెట్‌ఫ్లిక్స్ మళ్లీ సంతృప్తి చెందలేదు. దీంతో వెబ్ సిరీస్‌నే క్యాన్సిల్ చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ వెబ్‌సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటి వరకు రూ.150 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ విజువల్స్, అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.
బాహుబలి 1,2 భాగాలు భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచాయి. రెండో భాగం అయితే ఏకంగా రూ.1,700 కోట్ల వరకు వసూళ్లను సాధించి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ నిలిచింది.