"డీజే టిల్లు'లో నిజాయతీ, ఆత్మ విశ్వాసంతో కూడిన ఈతరం అమ్మాయి రాధిక పాత్రలో నటించాను. ఎవరేం అనుకుంటారనేది ఆలోచించకుండా తను కరెక్ట్ అనుకున్నది చేసే అమ్మాయి రాధిక. ఇలాంటి పాత్రను ఇప్పటివరకూ సినిమాల్లో చూడలేదు" అని హీరోయిన్ నేహా శెట్టి అన్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ... ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిసున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో నేహా శెట్టి ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ...
- ట్రైలర్ విడుదలయ్యాక... నన్ను రాధిక ఆప్తే అని పిలుస్తున్నారంతా! ట్రైలర్ చూసి రొమాంటిక్ సినిమా అనుకోవద్దు. వినోదం, ఉత్కంఠ, రొమాన్స్... కమర్షియల్ హంగులు అన్నీ సినిమాలో ఉన్నాయి. హీరోతో రాధిక గేమ్ ఆడినట్టు, కన్‌ఫ్యూజ్ చేసినట్టు ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. కానీ, రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. సినిమా చూస్తే... అది తెలుస్తుంది. దర్శకుడు స్వేచ్ఛ ఇవ్వడంతో రాధిక పాత్రలో సహజంగా నటించాను. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ ఉంటుంది.
- నేను 'డీజే టిల్లు' కథ విన్నప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. నేను తెలంగాణ యాస వినడం కొత్త. కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా కొత్తగా ఫీలయ్యా. తెలంగాణ యాసలో ఇంకా చాలా సినిమాలు రావాలి. నాకు కథ నచ్చింది. రాధిక, హీరోయిన్ క్యారెక్టర్ నచ్చింది. పైగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అందుకే, వెంటనే ఓకే చెప్పేశా.
- సిద్ధూ జొన్నలగడ్డ చాలా టాలెంటెట్. అతను నటిస్తుంటే... నవ్వు వచ్చేది. చాలా సార్లు ఆపుకోలేకపోయేదాన్ని. నటన విషయంలో తన నుంచి చాలా నేర్చుకున్నా. సిద్ధు మంచి రచయిత, గాయకుడు కూడా. సిద్ధు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్... అందరం స్నేహితుల్లా సరదాగా ఉండేవాళ్లం. కరోనా వల్ల జీవితంలో మనమంతా చాలా ఒత్తిడికి గురయ్యాం. ఈ సినిమా చూస్తే హాయిగా నవ్వుకుని ఆ ఒత్తిడిని మర్చిపోవచ్చు.
- కన్నడ సినిమా 'ముంగారుమళై 2'తో నేను కథానాయికగా పరిచయమయ్యా. ఆ తర్వాత తెలుగులో ఆకాష్ పూరికి జంటగా పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించిన 'మెహబూబా'లో నటించా. తెలుగులో అదే నా తొలి సినిమా. రెండు సినిమాలు చేశాక... న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చా. 'గల్లీ రౌడీ' కథానాయికగా, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అతిథి పాత్రలో నటించా. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. త్వరలో వివరాలు చెబుతా.