నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh Shivan) తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సరోగసీ పద్దతిలో ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. న‌య‌న స‌రోగ‌సీ ద్వారా త‌ల్లి అవ్వ‌డం చ‌ట్ట బ‌ద్ధంగా జ‌రిగిందా? లేదా? అనే విషయాన్ని విచారించ‌డానికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఓ త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించింది. ఈ కమిటీ వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఇందులో భాగంగా నయన్, విఘ్నేష్ లను విచారణ చేయనున్నారు.


తాజాగా నయన్ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ఈ జంట ఆరేళ్లక్రితమే తమకు పెళ్లయిందని.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాన్ని తెలిపింది. వివాహానికి సంబంధించిన డాకుమెంట్స్ తో పాటు అఫిడవిట్ ను కూడా అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. సరోగసీ చట్టం 2021 ప్రకారం.. పెళ్లైన జంట ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే సరోగసీకి అర్హులు.


అద్దెగ‌ర్భాన్ని ఇచ్చేవారు కూడా బంధువులై ఉండాలనేది చట్టం. నయనతార పిల్లల సరోగేట్ మదర్ యూఏఈకి చెందిన మహిళ అని.. ఆమె నయన్ కు బంధువని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కవలలు జన్మించిన చెన్నై హాస్పిటల్ కి కూడా అధికారులు ఇండెంట్ పెట్టారు. తాము చట్టాన్ని అతిక్రమించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఒకవేళ నయన్ గనుక రూల్స్ కి వ్యతిరేకంగా సరోగసీ ద్వారా పిల్లలను పొందిందని తేలితే.. ప‌ది సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌, ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానా విధించే అవ‌కాశాలున్నాయ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 


Also Read: 'మానాడు' రీమేక్‌లో రవితేజ - నెగెటివ్ రోల్ అంటే ఒప్పుకుంటారా?


జూన్ 9న నయన్, విఘ్నేష్ ల వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే మాల్దీవులకు నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్ వేశారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న 'జవాన్' షూటింగులో నయనతార జాయిన్ అయ్యారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ రిలీజ్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ చేశారు.


పెళ్లికి ముందు నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. సరోగసీ ద్వారా పండంటి కవలలకు జన్మ ఇచ్చారని సమాచారం. సరోగసీ ద్వారా షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, తెలుగులో లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరారని చెప్పుకోవచ్చు.