సౌత్ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి నయనతార. ఈ మధ్యే కవల పిల్లలను కన్న ఈ ముద్దుగుమ్మ, వారితో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన రెండు దశాబ్దాల ప్రయాణంలో మంచి చెడుల గురించి వివరించారు. కెరీర్ లో ఎంతో ఉన్నత శిఖరాలను చూసినట్లు చెప్పారు. సినిమా పరిశ్రమలో తనది 19 ఏళ్ల ప్రయాణం అని నయనతార వెల్లడించారు. ప్రస్తుతం తాను హ్యాపీగా ఉన్నట్లు వివరించారు. సినిమా రంగంలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు రాణించడం అంత ఈజీ ఏమీ కాదన్నారు.
నయనతార 2003లో ‘మనసునక్కరే’ అనే మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆమె తమిళంలో ‘అయ్య’(2005), తెలుగుతో ‘లక్ష్మి’(2006)తో పాటు కన్నడతో ‘సూపర్’(2010) సినిమాలతో ఇతర సినిమా పరిశ్రమల్లోకి అడుగు పెట్టారు. ‘శ్రీ రామరాజ్యం’, ‘చంద్రముఖి’, ‘గజిని’, ‘రాజా రాణి’, ‘అరమ్’, ‘ఇరుముగన్’, ‘నేత్రికణ్’ లాంటి చిత్రాలలో అద్భుత విజయాలను అందుకుంది.
ప్రేక్షకుల ఆదరణ, దేవుడి ఆశీర్వాదం వల్లే ఈ స్థాయి
తాజాగా ఓ వార్తా సంస్థతో నయన్ మాట్లాడుతూ.. తన కెరీర్ కు సంబంధించి వివరాలను వివరించింది. "నేను సినిమా పరిశ్రమలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రస్తుతం అంతా బాగుంది. కెరీర్ విషయంలో నేను చేసిన తప్పులు, మంచి, చెడులు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. అందంతా నేను నేర్చుకున్న అనుభవంగానే భావిస్తున్నాను. 18-19 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం అంత సులభం కాదు. కానీ, ప్రేక్షకులు, దేవుడు నా పట్ల ఆదరణ, దయ చూపారు. వారి ఆశీర్వాదం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని వెల్లడించారు.
మంచి సినిమాలు అందించాలన్నదే మా కోరిక
అటు నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ 2021లో రౌడీ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించారు. ఈ సంస్థ నుంచి ‘కూజంగల్’, ‘నేత్రికన్’, ‘కాతువాకుల రెండు కాదల్’ లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. “సినిమా నిర్మించినా, కొన్నా, నేను సినిమాలో నటించినా మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించడమే నాపని. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు ఒకటే భావిస్తాను మంచి కంటెంట్ తో మంచి సినిమాలు తీయాలి అని. మీరు మీ క్రాఫ్ట్ పట్ల నిజాయితీగా ఉంటే, మీరు మీ పనిని బాగా చేస్తే, కచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రేక్షకులు మీతో కనెక్ట్ అవుతారు. వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆదరిస్తారు” అని చెప్పారు.
‘జవాన్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ
నయన తార తాజాగా తమిళంలో ‘కనెక్ట్’ అనే హార్రర్ మూవీ చేసింది. అటు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. నయనతార ఈ సంవత్సరం అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 2న విడుదల కానుంది.
Read Also: అప్పుడు ఫైటింగ్, ఇప్పుడు మీటింగ్, చిరంజీవి గురించి అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్