2023 మే నెలలో ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యువ సామ్రాట్ నాగ చైతన్య. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’, ‘కార్తికేయ 2’ చిత్రాల దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.


ఈ సినిమాకు సంబంధించిన రీసెర్చ్ కోసం నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు... శ్రీకాకుళానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. మత్స్యకారుల రోజువారీ జీవితాన్ని పరిశీలించడం కోసం వారితో కలిసి నాగ చైతన్య ఒక రోజు వేటకు కూడా వెళ్తారని వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాల్సి ఉంది.


2018లో గుజరాత్ నుంచి వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌ గార్డ్‌ల‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారితంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మత్స్యకారుల వలసలు, పాకిస్తాన్ వారికి చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటి ఇతి వృత్తంతో ఈ సినిమా సిద్ధం కానుందట. 


‘కస్టడీ’ ఆశించిన ఫలితం సాధించలేక పోవడంతో నాగ చైతన్య ఆశలన్నీ చందూ మొండేటి సినిమా మీదనే ఉన్నాయి. ‘కస్టడీ’కి ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. ఏడు కోట్ల షేర్ మాత్రమే లభించింది. గ్రాస్ అయితే రూ.15 కోట్లకు కాస్త అటూ ఇటుగా ఉంది. దీంతో కనీసం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సగం వసూళ్లను కూడా సాధించలేకపోయింది.


తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు 'కస్టడీ' సినిమాను తెరకెక్కించారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాకు అన్ని చోట్లా  మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆశించిన రీతిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు విడుదలకు ముందు ఎక్కువ బజ్ కూడా క్రియేట్ కాలేదు. దీంతో తొలి రోజు నుంచే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో మొదటి రోజు మ్యాట్నీ నుంచి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.