Deepavali 2023 Movie Review : దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సినిమా 'దీపావళి'. ప్రముఖ తెలుగు నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'కు తెలుగు అనువాదం ఇది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ప్రేక్షకులకు చూపించడానికి ముందు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది చూస్తే...


కథ (Deepavali Movie Story) : శీనయ్య (పూ రాము) కుమార్తె, అల్లుడు ప్రమాదంలో మరణిస్తారు. అప్పటి నుంచి మనవడు గణేష్ (మాస్టర్ దీపన్ విరుమాండి)ని తమ ఇంటి వద్ద ఉంచుకుని అల్లారుముద్దుగా చూసుకుంటారు. మనవడు అంటే ప్రేమ ఉన్నప్పటికీ... చాలా పేద కుటుంబం కావడంతో అడిగినది కొని ఇవ్వలేని పరిస్థితి శీనయ్యది. దీపావళికి మనవడు కొత్త డ్రస్ కొని ఇవ్వమని అడుగుతాడు.ఎలాగైనా సరే డ్రస్ కొనాలని బంధుమిత్రులను శీనయ్య డబ్బులు అడుగుతాడు. రూపాయి అప్పు పుట్టదు. దాంతో దేవుడికి మొక్కిన మేకను అమ్మాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తెలిసి చాలా మంది కొనడానికి ముందుకు రారు. 


తాను మాంసం కొట్టే షాపు యజమాని కుమారుడితో గొడవ కావడంతో కొత్త మటన్ షాప్ ఓపెన్ చేస్తానని సవాల్ చేసిన వీరాస్వామి (కాళి వెంకట్) ఆ మేకను కొనడానికి ముందుకు వస్తాడు. అయితే... దీపావళి ముందురోజు రాత్రి ఎవరో ఆ మేకను ఎత్తుకువెళతారు. మేకను వెతుకుతూ వెళ్లిన శీనయ్య, వీరాస్వామికి ఆ మేక దొరికిందా? లేదా? మనవడికి శీనయ్య కొత్త డ్రస్ కొన్నాడా? లేదా? వీరాస్వామి కుమారుడి ప్రేమకథ ఏమిటి? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Deepavali Movie Review): 'దీపావళి'కి బలం, బలహీనత సహజత్వానికి చాలా దగ్గరగా తీయడమే! ఈ సినిమా, 'బలగం' మధ్య ఓ సారూప్యత ఉంది. అది ఏమిటంటే... రెండింటిలోనూ చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. గుండె లోతుల్లో దాగిన తడిని బయటకు తీసే ఎమోషన్స్ ఉన్నాయి . అయితే... 'బలగం'లో కాస్త కమర్షియాలిటీ కనిపిస్తే, ఈ 'దీపావళి'లో అది కొంచెం కూడా లేదు.


బాల్యంలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, తన అమ్మమ్మ - తాతయ్య పడిన మానసిక సంఘర్షణ ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆర్ఏ వెంకట్ ఈ 'దీపావళి'  చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన కథ నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సహజత్వాన్ని వదిలి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. దాంతో విశ్రాంతి వరకు సినిమా నిదానంగా, కాస్త భారంగా ముందుకు వెళుతున్న భావన కలుగుతుంది. విశ్రాంతి తర్వాత కథలో సంఘర్షణ, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మనకు తెలియకుండా కళ్ళు చెమ్మగిల్లుతాయి. 


పూ రాము, దీపన్ విరుమాండి, కాళీ వెంకట్, అమ్మమ్మ పాత్ర చేసిన మహిళ... ప్రతి ఒక్కరూ సహజంగా నటించారు. కాళీ వెంకట్ కుమారుడు, ఆయనకు మరదలి పాత్ర చేసిన అమ్మాయి కూడా! సినిమాలో రెండు పాటలకూ గోసాల రాంబాబు చక్కటి సాహిత్యం అందించారు. థీసన్ సంగీతం పర్వాలేదు. కథకు ఎంత మేరకు అవసరమో... 'స్రవంతి' రవికిశోర్ అంత ఖర్చు చేశారు. సినిమా ప్రారంభమైన కాసేపటికి పల్లె వాతావరణంలోకి తీసుకు వెళ్లడంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. అయితే... సినిమా నిదానంగా ముందుకు కదులుతుంది. చాలా స్లో! 


Also Read శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే... ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ


'దీపావళి'లో కథ కంటే... కొన్ని సన్నివేశాలు, భావోద్వేగాలు థియేటర్ల నుంచి వచ్చిన తర్వాత మనసులోంచి కదలవు. పండక్కి డ్రస్ అడిగిన మనవడు, తాతయ్య మేకను అమ్మాలని ప్రయత్నిస్తుంటే డ్రస్ వద్దని, మేక కావాలని అడగటం... డబ్బులు దొరక్క ఇంటికి వెళ్లకుండా ఊరు చివర తాతయ్య వెయిట్ చేయడం... పతాక సన్నివేశాల్లో దృశ్యాలు గానీ... హృదయానికి హత్తుకుంటాయి. కమర్షియల్ సినిమాల మధ్య 'దీపావళి' ప్రత్యేకంగా నిలుస్తుంది. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది. ముఖ్యంగా క్లైమాక్స్ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. 


Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?