‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అదే జోష్ తో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’ త్వరలో థియేటర్లలో అలరించబోతోంది. రమేష్ కడూరి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తోంది.
అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్
సమ్మర్ స్పెషల్ గా ‘మీటర్’ మూవీ ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఎవరినీ పట్టించుకోని, తన స్వంత నిర్ణయాల ప్రకారం ముందుకు సాగే పోలీసుగా కిరణ్ అబ్బవరం యాక్షన్-ప్యాక్డ్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమ్మాయితో ప్రేమలో పడటంతో పాటు, రాజకీయ నాయకుడితో కయ్యానికి కాలుదువ్వుతారు.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్
తండ్రి కోరిక మేరకు కిరణ్ పోలీసు అవుతారు. తండ్రి ప్రేరణతో డ్యూటీని సీరియస్‌గా తీసుకుంటారు. తన పోలీసు ప్రయాణంలో పొలిటీషియన్స్ తో పాటుపై అధికారులతోనూ ఢీకొడతారు. ‘‘భగవంతుడి ముందు భక్తితోనూ బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి” అని విలన్ చెప్పే డైలాక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఓవైపు సీరియస్ గా ఉంటూనే మరోవైపు కామెడీని పండిస్తారు. ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్విరాజ్, సప్తగిరి కామెడీ భాగానే పండిస్తారు. ఈ చిత్రంలో అతుల్య రవి గ్లామ్ డాల్‌గా కనిపించింది. ఇతర నటీనటులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ సి దిలీప్ అద్భుతమైన పనితీరు కనబర్చారు. సాయి కార్తీక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లారు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం ఈసారి హిట్టు కొట్టేలాగే ఉన్నాడు. ట్రైలర్ ఒకే. కానీ, పూర్తి నిడివి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ఇక ‘రాజావారు రాణిగారు’ సినిమాతో సినిమా రంగంలోకి కిరణ్ అడుగు పెట్టారు. ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ మీద చిరంజీవి, హేమలత ‘మీటర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ కాడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో పవన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 7, 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్నది.
Read Also: దుమ్మురేపుతున్న‘చమ్కీల అంగీలేసి’ సాంగ్, సోషల్ మీడియాకు కొత్త వైరస్!