మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మలయాళ వెర్షన్ ను చూసి ఇష్టపడి మరీ హక్కులు రీమేక్ హక్కులు కొనిపించాడు. ఈ సినిమా కథను మెగాస్టార్ ఇమేజ్ కి సరిపడే విధంగా మార్పులు, చేర్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథ మీద చాలా కసరత్తు చేశారు. ముందుగా దర్శకుడు సుజీత్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేశారు. ఆ తరువాత వి.వి.వినాయక్ చేతుల్లోకి వెళ్లింది. ఫైనల్ గా మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తికాగానే 'లూసిఫర్' సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి కరోనా ఎఫెక్ట్ గనుక లేకపోతే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది కానీ సెకండ్ వేవ్ వచ్చి షూటింగ్ లకు అడ్డు పడింది. ఆ కారణంగానే సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు 'ఆచార్య' సినిమా ఓ కొలిక్కి రావడంతో చిరు 'లూసిఫర్' రీమేక్ పై దృష్టి పెట్టారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 13 నుండి మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 13న షూటింగ్ మొదలుపెట్టి గ్యాప్ లేకుండా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో 'కింగ్ మేకర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ 'గాడ్ ఫాదర్' టైటిల్ కే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నే టైటిల్ గా ఫిక్స్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో కుర్ర హీరో సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే నయనతారను ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన ఒక పాటని లండన్ లో ఆబ్బె అనే స్టూడియోలో రికార్డు చేయనున్నారు