టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎందరో దర్శకులతో పని చేశారు. కానీ తన తండ్రితో సమానంగా భావించేది మాత్రం కళా తపస్వి కె.విశ్వనాథ్‌నే. మెగాస్టార్ కెరీర్‌లో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉండవచ్చు కానీ ఆయన మనసుకు దగ్గరైన సినిమాలు కొన్నే. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్భాందవుడు, స్వయంకృషి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. చిరంజీవిలోని స్టార్‌ని కాకుండా నటుడిని చూసిన కొద్ది మంది డైరెక్టర్లలో విశ్వనాథ్ కూడా ఒకరు.
దీంతోపాటు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి మీద కె.విశ్వనాథ్ ఎంతో ప్రేమ చూపించేవారు. స్వయంకృషి సినిమా షూటింగ్ సమయంలో భోజనం చేయకుండా పడుకుంటే కె.విశ్వనాథ్ స్వయంగా తన చేత్తో పెరుగన్నం కలిపి ఇచ్చారని చిరంజీవి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయన్ను ఎప్పుడు కలిసినా చిరంజీవి కళ్లలో ఆ పితృవాత్సల్యం కనిపిస్తుంది.
కె.విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపే ఒక సంఘటనను చిరంజీవి ఒక అవార్డు ఫంక్షన్‌లో తెలిపారు. ఆ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘స్వయంకృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక గుడిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నానన్న ఫీలింగ్ నాకుంది. కమల్ హాసన్‌కు ఆ ఫీలింగ్ రివర్స్‌లో ఉంది (నవ్వుతూ). ఆ లావు తగ్గించుకోవడం కోసం నేను మధ్యాహ్నం పూట భోజనం చేసేవాడిని కాదు.’
‘కె.విశ్వనాథ్ గారు లంచ్ బ్రేక్ అనగానే నేను ఒక పక్కకి వెళ్లి పడుకున్నాను. అప్పుడు ఆయన చిరంజీవి రావడం లేదేంటి? తినడం లేదంటి? ఆకలితో ఉన్నవాడి చేత నేనెలా చేయించుకుంటాను అన్నారు. అప్పుడు పక్కనున్న వాళ్లు ఆయనకు అలవాటే అండీ అన్నా ఆయన వినలేదు. చిరంజీవిని నిద్ర లేపకండి అని ఆయన చేత్తో స్వయంగా పెరుగన్నం కలిపి ఇది స్వయంగా నేను కలిపానని చెప్పండి. దాంట్లో పెరుగన్నం కాదు నా ప్రేమని కలబోశానని చెప్పండి. ఎందుకు తినడో చూస్తాను అన్నారు. అది కంచి గుడి. ఆ తర్వాత నేను షాట్ రెడీ అని లేస్తుంటే వాళ్లు వచ్చి విశ్వనాథ్ గారు మీకు పెరుగన్నం పెట్టారు తినమని చెప్పారు. నేను తినను కదా అన్నాను. అప్పుడు ఆయన మాటలు చెప్పారు. అవి వినగానే నా తండ్రి నాకు కలిపిచ్చినట్లుగా అనిపించింది. ఆ గుళ్లో సాక్షాత్తూ శివుడు ఎందుకు పస్తులుంటావని ఈయన ద్వారా అనిపించినట్లు నాకు అనిపించింది. అది ఒక ప్రసాదం లాగా తిన్నాను తప్ప పెరుగన్నంలా తినలేదు. నేను ఎంతో మందితో పని చేశాను. కానీ నటీనటులను ఇంత ప్రేమగా చూసుకునే ఒకే ఒక దర్శకుడు నాకు తెలిసి విశ్వనాథ్ గారు. ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా రెండు బుగ్గలూ నిమురుతూ నన్ను ముద్దాడతారు ఆయన. అప్పుడు మా నాన్న గుర్తొస్తారు. ఇటువంటి దర్శకులు నిండు నూరేళ్లు బతకాలి. ఆయన ఆరోగ్యంతో ఉండాలి. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆయనకు సన్మానం కాదు. ఆయన ప్రేమను తెలియజెప్పే అవకాశం ఇది. ఆయన ఇంతకంటే గొప్ప సన్మానాలు ఎన్నో చూశారు. ఈ అవార్డు ఆయనకి గొప్ప కాదు. ఆయనకు వచ్చినందుకు ఆ అవార్డే గర్వపడాలి. ఇది వారి అదృష్టం.’ అన్నారు.
ఈ స్పీచ్ జరుగుతున్నంత సేపు చిరంజీవి నుంచుని కాకుండా కె.విశ్వనాథ్ పక్కన కూర్చునే మాట్లాడారు. కె.విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. అవే ఆపద్భాందవుడు, శుభలేఖ, స్వయంకృషి. చిరంజీవి ఉత్తమ నటుడిగా తన మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును శుభలేఖ సినిమాకు అందుకున్నారు. ఇక ఆపద్భాందవుడు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది, ఫిల్మ్‌ఫేర్ రెండు అవార్డులూ వచ్చాయి. స్వయంకృషి సినిమాకు కూడా చిరంజీవి ఉత్తమ నటనకు నంది అవార్డును పొందారు. అంతే కాకుండా ఇవి మూడు ఎవర్‌గ్రీన్ సినిమాలు కూడా. కె.విశ్వనాథ్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు భారత చలనచిత్ర పరిశ్రమకు కూడా తీరని లోటు.