Manoj Weds Mounika: మంచు మనోజ్, మౌనికా రెడ్డిల వివాహం ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో జరిగింది. వైభవంగా జరిగిన ఈ వివాహంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈరోజు ఉదయం మంచు మనోజ్ సోషల్ మీడియాలో మౌనిక ఫోటో షేర్ చేశారు. 'పెళ్లి కూతురు' అని దానికి క్యాప్షన్ పెట్టారు. #ManojWedsMounika, #MWedsM అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించారు. తమది ప్రేమ వివాహం అని చెప్పడానికి సంకేతం లాగా రెడ్ హార్ట్ / లవ్ సింబల్ ఎమోజీ కూడా పోస్ట్ చేశారు. తమకు అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పినట్లు రెండు చేతులు జోడించిన ఎమోజీ కూడా యాడ్ చేశారు.
హైదరాబాదులోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు ఇల్లు ప్రేక్షకులకూ తెలుసు. ఇప్పుడు ఆ ఇంటిని లక్ష్మీ మంచుకు రాసి ఇచ్చినట్లు వినికిడి. అందులో లక్ష్మీతో పాటు మనోజ్ ఉంటున్నారు. ఆ ఇంటిలోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. మెహందీ ఫోటోలను సోషల్ మీడియాలో లక్ష్మీ మంచు షేర్ చేశారు. ఈ వివాహానికి అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించారట.
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా... అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది.
ఎవరీ భూమా మౌనిక?
రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం కల భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగి రెడ్డి, శోభా రెడ్డిల మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి రాగా... కష్టకాలంలో అక్కకు అండగా నిలిబడుతూ, తమ నియోజకవర్గంలో కార్యకర్తలతో మౌనిక టచ్ లో ఉంటున్నారు.
మంచు మనోజ్ రెండో పెళ్లి ఇది. తొలుత ప్రణతిని మనోజ్ ప్రేమించారు. వాళ్ళిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు. అటు భూమా నాగ మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహం.