Guntur Kaaram Second Single: 2024 సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో అన్నిటి కంటే ఎక్కువ హైప్‌తో వస్తున్నది మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’. 2024 జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే విడుదల అయిన మొదటి పాట ‘దమ్ మసాలా’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 13వ తేదీన విడుదల కానుంది.


ఇక ప్రోమో విషయానికి వస్తే... ‘అమ్మూ... రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది.’ అని శ్రీలీలతో మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఉంది. ఇది ఒక మెలోడీ సాంగ్ అని ప్రోమోను బట్టి తెలుస్తోంది. పూర్తి పాట ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం డిసెంబర్ 13వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ స్వరాలు అందిస్తున్నారు. ‘ఓ మై బేబీ’ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా,  శిల్పా రావు పాడారు.



మరోవైపు ‘గుంటూరు కారం’ షూటింగ్ డిసెంబర్ నెలాఖరుకు పూర్తి కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి స్వింగ్‌లో సాగుతున్నాయి. కొంతకాలం ముందు వరకు ఈ సినిమా సంక్రాంతికి రావడం కాస్త డౌట్ అని వార్తలు వినిపించాయి. కానీ చిత్రబృందం దాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి తీసుకువచ్చేందుకు వర్క్ చాలా టైట్‌గా చేస్తున్నారు.


'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న సినిమా 'గుంటూరు కారం'. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు ముందు వచ్చిన సినిమాల కంటే మహేష్ బాబును బాగా మాసీగా చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు విడుదల చేసిన చాలా స్టిల్స్‌లో బీడీ కలుస్తూ కనిపించారు మహేష్ బాబు. 


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'గుంటూరు కారం'లో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన ‘గుంటూరు కారం’ థియేటర్లలోకి రానుంది. అదే రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హనుమాన్' కూడా విడుదల కానుంది. ఇక తర్వాత రోజు అయిన జనవరి 13వ తేదీన విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న 'ఈగిల్' సినిమాలు కూడా వస్తున్నాయి. దీంతోపాటు నాగార్జున ‘నా సామి రంగ’ కూడా సంక్రాంతి టార్గెట్‌గానే తెరకెక్కుతోంది. ఈ ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు.


దీంతోపాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా దండయాత్రకు రెడీ అవుతున్నాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’, రజనీకాంత్ ప్రత్యేకపాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ కూడా సంక్రాంతికే రానున్నాయి. అయితే వీటిలో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయి, ఎన్ని వాయిదా పడతాయనేది మాత్రం చూడాల్సి ఉంది.