Dr. L. Subramanium Musical Journey: భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యమైన వయోలిన్‌కు  గ్లోబల్ గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో డాక్టర్ ఎల్. సుబ్రహ్మణ్యం పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. విశిష్ట వయలనిస్ట్, అద్భుతమైన  కంపోజర్, ఆర్కెస్ట్రా కండక్టర్, మ్యూజిక్ స్కాలర్‌గా… భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యానికి సాంస్కృతిక సరిహద్దులు చెరిపేశారు.  ఐదు ఖండాలలోని సింఫనీ హాల్స్, అంతర్జాతీయ సాంస్కృతిక వేదికల్లో భారతీయ వయలిన్ ప్రతిష్టను నిలబెట్టారు.

Continues below advertisement

కానీ తన అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు… ప్రతీసారి ఆయన మాటలు ఒకే వ్యక్తి దగ్గర ఆగుతాయి తన తండ్రి, గురువు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం.

“ ఈ ముఖం నాది కావచ్చు… కానీ ఈరోజు ఉన్న టెక్నిక్, విజన్, కాన్ఫిడెన్స్ అన్నీ నాన్నవే” – అని సుబ్రహ్మణ్యం వినమ్రంగా చెబుతారు.

Continues below advertisement

తన సుదీర్ఘమైన ఇంటర్వూలో ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. చిన్నతనంలో వేరే ప్రాంతానికి వలసవెళ్లడం… తన సంగీత ప్రయాణానికి సమాంతరంగా సాగిన వైద్య విద్య, లక్ష్మీనారాయణ మ్యూజిక్ ఫెస్టివల్ ఆరంభం.. అది ఇప్పుడు 35వ వసంతానికి చేరడం ఇలా చాలా విషయాలపై మాట్లాడారు.

 

ఆరేళ్ల వయసు… ఆలయ వేదిక… విధి లిఖితం..

డాక్టర్ సుబ్రహ్మణ్యం తొలి పబ్లిక్ పెర్ఫార్మెన్స్ భారతదేశంలో కాదు – శ్రీలంక, జాఫ్నాలోని నల్లూరు కందస్వామి ఆలయంలో జరిగింది. వయస్సు కేవలం ఆరు ఏళ్లు. భయం… ఒత్తిడి… పెద్ద జనసమూహం.

“నిర్వాహకులు నన్ను స్టేజీపైకి పంపాలని ఇష్టపడలేదు. ఇంత పెద్ద ఉత్సవంలో ఆరేళ్ల బాబు పాడితే కార్యక్రమం పాడవుతుందని భయపడ్డారు. కానీ నాన్న మాత్రం వెనక్కి తగ్గలేదు.” మధ్యలోనే తండ్రి మైక్‌లో ప్రకటించి… వయలిన్ చేతిలో పెట్టి… కుమారుడిని స్టేజీపైకి నెట్టేశారు. “ఆర్గనైజర్ల భయం… ఫెయిల్ అవుతాననే టెన్షన్… ఇంటికి తిరిగివెళ్లాల్సి వస్తుందనే భయం… నేను ఏం వాయించానో కూడా గుర్తులేదు” – అని ఇప్పుడు నవ్వుతూ గుర్తుచేసుకుంటారు. కానీ అది ముగిసిన తర్వాత మాత్రం మారుమోగిన చప్పట్లు.. పెద్ద కోలాహలం.. ఆలయ అధికారులు అన్న మాట.. “ఈ  దేవుడే  బిడ్డ రూపంలో వాయించాడు.” అన్న మాటలు మాత్రం గుర్తుండిపోయాయని ఆయన తన మొదటి ప్రదర్శన గురించి గుర్తు చేసుకుంటారు.

ఓ అద్భుత  మహా సంగీత ప్రయాణానికి  అదే శుభారంభం.

 

వలస… నష్టాలు… తిరిగి నిర్మాణం

1958లో శ్రీలంకలో జరిగిన భారత వ్యతిరేక అల్లర్లు వారి జీవితాన్ని ఒక్క రాత్రిలో తారుమారు చేశాయి. అన్నీ కోల్పోయి…ఇండియా తిరిగివచ్చారు.  ఎనిమిది  పిల్లలతో మళ్లీ  సున్నా నుంచి భారత్‌లో కొత్త జీవితం ప్రారంంభించాల్సి వచ్చింది. “నాన్న అన్నీ కోల్పోయారు. కానీ నిరాశ పడలేదు. తిరిగి ఆలోచన మార్చారు.”

కర్ణాటక సంగీతంలో వయలిన్ పక్క వాయిద్యం. కానీ లక్ష్మీ నారాయణ సుబ్రమణ్యం దానిని పాశ్చాత్య సంగీత వాయిద్యాలకు దీటుగా సోలో వాయిద్యంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనుకున్నారు.

“అది అప్పట్లో విప్లవాత్మక ఆలోచన. వైలిన్‌ను పూర్తిగా రీ-ఇంజినీర్ చేశారు. ప్రపంచ వేదికపై ఒంటరిగా నిలబడే స్థాయికి తీసుకువచ్చారు.”

అదే ఆలోచనతో లెజెండరీ Violin Trio రూపుదిద్దుకుంది.  డాక్టర్ సుబ్రమణ్యం సోదరులుతో మ్యూజిక్ లెజండ్ పాల్ఘాట్ మణి అయ్యర్ చేరికతో వయలిన్ ప్రపంచంలో కొత్త శకం ప్రారంభమైంది.

మెడిసినా ? సంగీతమా…?

సంగీతంలో అద్భుత ప్రతిభ ఉన్నా… డాక్టర్ సుబ్రహ్మణ్యం MBBS చదివారు. అద్భుతమైన సంగీత పరిజ్ఞానం ఉన్న ఆయన వైద్య విద్యను ఎన్నుకోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. మెడికల్ బోర్డ్ ఇంటర్యూలో కూడా.. “ప్రెసిడెంట్ అవార్డ్ గెలిచిన మీరు… మెడికల్ సీట్ తీసుకుని ఎందుకు వృథా చేస్తారు..? అని ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  “ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. సైన్స్ అంటే ఇష్టం. డాక్టర్ అయితే స్థిరత్వం ఉంటుంది.” అని ఆయన చెప్పారు. అప్పటికే జర్మనీలో చదివేందుకు మ్యూజిక్ స్కాలర్‌షిప్‌ వచ్చినా ముందు మెడిసిన్ పూర్తి చేయమని ఆయన తల్లి సలహా ఇచ్చారు. ఇప్పుడా నిర్ణయాన్ని జీవితంలో బెస్ట్ అడ్వైస్‌గా చెబుతారు. “MBBS లేకపోతే… తర్వాత మ్యూజిక్‌లో PhD, డాక్టరేట్ చేయలేకపోయేవాడిని.” అని ఆయన అంటారు.

ఫ్యూజన్, జాజ్, ఆర్కెస్ట్రా – సరిహద్దులు చెరిపేసిన ప్రయోగాలు

డాక్టర్ సుబ్రమణ్యం.. గ్లోబల్ జర్నీ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేయడంతో ప్రారంభమైంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వెస్ట్రన్ ఆర్కెస్ట్రా, జాజ్తో మిళితం చేయడం అప్పట్లో వివాదాస్పదం. కానీ కానీ Fantasy Without Limits, Conversations (జాజ్ లెజెండ్ Stéphane Grappelliతో) ఆల్బమ్స్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. Herbie Hancock, Miles Davis వంటి దిగ్గజాల సరసన నిలబెట్టాయి. “మ్యూజిక్ రాస్తే… ప్రతి నోట్ నేనే రాస్తాను. అది వెస్ట్రన్ క్లాసికల్ ట్రైనింగ్ నేర్పిన డిసిప్లిన్.” అంటారు. 

 

జుబిన్ మెహతావంటి maestros  సాంగత్యంలో ఆయన అనేక అంతర్జాతీయ సింఫనీల్లో పాల్గొన్నారు. సినిమారంగంలోనూ తనదైన ముద్ర వేశారు. Salaam Bombay  కు ఆయనిచ్చిన స్కోర్‌ అద్భతం. విఖ్యాత డైరక్టర్  సత్యజిత్ రే  ““ఒక్క నోట్ ఎక్కువ కాదు… ఒక్క నోట్ తక్కువ కాదు… పర్ఫెక్ట్ స్కోర్.” అంటూ సుబ్రమణ్యం ప్రతిభను పెంచుకున్నారు.

లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ – స్మరణ, సాధన, స్వప్నం

 

తండ్రి మరణానంతరం… వైలిన్‌ను చూడటానికే మనసు రాలేదు. “వయోలిన్ కనిపించిన ప్రతీసారీ… నాన్న గుర్తొచ్చేవారు.” అని తలచుకున్నారు. అప్పుడే 1992లో… తండ్రి జయంతి రోజున Lakshminarayana Global Music Festival.  ప్రారంభించారు. అది ఆయన తండ్రికి ఇచ్చే నివాళి మాత్రమే కాదు.. డాక్టర్ సుబ్రమమ్యానికి తండ్రి లేని లోటు తీర్చే స్వాంతన కూడా…!

చెన్నై నుంచి మొదలైన ఈ ఫెస్టివల్… భారత్, ప్రపంచం అంతా విస్తరించింది. ఇండియన్ క్లాసికల్, జాజ్, ఫోక్, ఆర్కెస్ట్రా… అన్ని సంగీత సంస్కృతుల సంగమ వేదికగా మారింది. “ఈరోజు కనిపించే జుగల్‌బందీ కల్చర్… మేము దశాబ్దాల కింద మొదలుపెట్టిన సహకారాల ఫలితం.” అని ఆయన చెబుతారు. ఈ ఏడాది ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారి – ఆర్కెస్ట్రా + క్వాయర్ + బాలే ఒకే వేదికపై జరుగుతున్నాయి. నవగ్రహాలను ఆరాధిస్తూ.. సంస్కృత శ్లోకాల ఆధారంగా 45 నిమిషాల Navagraha Symphony జరుగుతుంది. ఈ సింఫనీలో సుబ్రమణ్యం కుటుంబంలోని మూడుతరాలు పాల్గొంటున్నాయి. అందుకే ఇది తనకు వ్యక్తిగతంగా.. చారిత్రాత్మకంగా ముఖ్యమైంది అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఎంత సాధించినా అదే వినయం.. అదే భక్తి

సుబ్రమణ్యం.. తన రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. లెజండరీ పర్సనాలిటీలతో పనిచేశారు. అయినా ఆయనిప్పటికీ చాలా వినమ్రంగా భయం, భక్తితో ఉంటారు. “ప్రతి ప్రదర్శన ముందు… గణపతి స్వామిని, నాన్నను గుర్తుచేసుకుంటాను.” అని చెప్పారు.  Stéphane Grappelliతో మెగా పెర్ఫార్మెన్స్ ముందు తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ మంత్రంలా వినిపిస్తాయి: “ఒక్కడే చక్రవర్తి ఉండగలడు… వెళ్లి వాయించు.” అన్న మాటలను నిత్యం గుర్తుంచుకుంటారు. ఆ ఆశీర్వాదమే తన ప్రయాణానికి బలం.

ఒక జీవన వారసత్వం

లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్…౩5 వ వసంతంలోకి వచ్చింది. డాక్టర్ సుబ్రమణ్యం దీని ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెబుతారు. “భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సంపూర్ణంగా మార్చిన ఓ వ్యక్తి విజన్‌కు తానిచ్చే గౌరవం ఇదని” ఆయన చెబుతారు. “భారతీయ వయెలిన్‌ను నేను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాను అని ప్రజలు అనుకుంటారు. కానీ నేను మా నాన్న కలను ముందుకు తీసుకెళుతున్నాను అంతే” అని చాలా వినయంగా చెబుతారు. భారతీయ సంగీత ప్రియులకు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది సాంప్రదాయ, నూతన ఆవిష్కరణల సంగమం. అంతేకాదు.. కొన్ని తరాలు సంగీతంతో మిళితమై.. మన సంస్కృతిని.. ఖండాంతరాలకు తీసుకువెళుతున్న ఓ ప్రయాణం.