"ఏదైనా ఘోరం జరిగినప్పుడే... నీలాంటి మగవాళ్ళు, ఎందుకని ఆడవాళ్ళను గౌరవించడం మొదలు పెడతారు?" అని ఓ నెటిజన్‌ను హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ ప్రశ్నించారు. ఆమె ఎందుకీ ప్రశ్న వేశారో తెలుసుకోవాలంటే... అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. తమిళనాడులో జరిగిన ఓ ఘటనకు, మత మార్పిళ్లకు, లావణ్య సూటిగా వేసిన ప్రశ్నకు సంబంధం ఉంది మరి!
క్రైస్తవం స్వీకరించనందుకు తమిళనాడులోని ఓ మైనర్ బాలిక లావణ్యను పలు రకాల వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య (Lavanya Suicide) చేసుకున్నారు. మాత మార్పిళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్న కొందరు లావణ్య విషయం న్యాయం జరగాలని (Justice For Lavanya) పోస్టులు పెట్టారు. లావణ్య సూసైడ్ పోస్టుల్లో లావణ్యా త్రిపాఠీ హ్యాష్ ట్యాగ్ కూడా ఉపయోగించారు. దాంతో కార్తీక్ అగర్వాల్ అని పేరుతో గల ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక రిప్లై వచ్చింది.
"లావణ్యా త్రిపాఠీ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించవద్దు. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత యువతి అయితే... లావణ్యా త్రిపాఠీ నటి. ధర్మం కోసం ప్రాణ త్యాగం చేసిన అమ్మాయిని చౌకబారు నటితో పోల్చవద్దు" అని కార్తీక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ ట్వీట్ లావణ్యా త్రిపాఠీ దృష్టికి వచ్చింది.
"ఏదైనా ఘోరం జరిగినప్పుడే... నీలాంటి మగవాళ్ళు, ఎందుకని ఆడవాళ్ళను గౌరవించడం మొదలు పెడతారు? అంతకు ముందు వాళ్ళను చీప్ (చౌకబారు) అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకో. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. కానీ, మన సమాజంలో వాస్తవ పరిస్థితి ఇదే" అని లావణ్యా త్రిపాఠీ (Lavanya Tripathi) ట్వీట్ చేశారు.