నందమూరి బాలకృష్ణ ఇటీవల 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ కొన్ని ఏరియాలలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది.
ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.