Keedaa Cola OTT Release: యూత్ ఫుల్ సినిమాలు తెరకెక్కించడంలో ముందు ఉండే దర్శకుడు తరుణ్ భాస్కర్. 'పెళ్లి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' సినిమాల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి తరుణ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. నవంబర్ 3న ఈ సినిమా  థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ, థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. చైతన్య రావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలో ఈ మూవీ ఓటీటీలో అలరించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.


డిసెంబర్ 29న ‘ఆహా’లో విడుదల


‘కీడా కోలా’ సినిమాను డిసెంబర్ 29న విడుదల చేయనున్నట్లు ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఇప్పటికే ఆహా ఈ చిత్రానికి సంబంధించిన నిన్న(డిసెంబర్ 18)న ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. “ఈ సీసాలో ఏదో క్రేజీగా ఉంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు త్వరలో వస్తోంది. ‘కీడా కోలా’ రిలీజ్ డేట్ రేపు ప్రకటిస్తాం” అని తెలిపింది. అన్నట్లుగానే ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.  వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇన్ని రోజులు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎట్టకేలకు ‘ఆహా’ నుంచి ప్రకటన రావడంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని వాళ్లు ఓటీటీలో చూడొచ్చని ఆనందపడుతున్నారు. 






‘కీడా కోలా’ కథ ఏంటంటే?


ముగ్గురు స్నేహితులు డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటారు. ఇందుకోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. అదే సమయంలోనే తాము తాగే కూల్ డ్రింక్ లో బొద్దింక ఉండటం చూస్తారు. కూల్ డ్రింక్ అమ్మిన యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని చూస్తారు. అదే సమయంలో మరికొన్ని గ్యాంగులు కూడా ఆ కూల్ డ్రింక్ బాటిల్‍ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇంతకీ ఆ కూల్‍డ్రింక్ బాటిల్ కోసం ఎందుకు కొట్లాడుతారు? చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కింది? అసలు ఆ కూల్‍డ్రింక్‍లో బొద్దింక ఎలా పడింది? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా మొత్తం 8 పాత్రల చుట్టూ తిరుగుతుంది.


థియేటర్లలో ఫర్వాలేదు అనిపించిన ‘కీడా కోలా’ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, కౌశిక్ నండూరి,  శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు.  వివేక్ సాగర్ సంగీతం అందించగా, ఆరోన్ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరించారు.


Read Also: ‘ఆదిపురుష్‌’ ఎలా ఉన్నా, ‘హనుమాన్‌’ ఇలాగే ఉంటుంది- ప్రశాంత్‌ వర్మ