Karthika Deepam 2:  ‘కార్తీక దీపం’. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని సీరియల్. సుమారు 1550కి పైగా ఎపిసోడ్స్ తో టాప్ రేటింగ్ సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మా చానెల్ లో ప్రసారమైన ఈ డైలీ సీరియల్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ ను చూడనిదే రోజు గడవని వాళ్లు ఎంతో మంది. చక్కటి ఆదరణ దక్కించుకున్న ఈ సీరియల్ జనవరి 2023లో అయిపోయింది.


‘కార్తీకదీపం‘ సీరియల్ కు సీక్వెల్


తమకు ఎంతో ఇష్టమైన సీరియల్ అయిపోవడంతో చాలా మంది ప్రేక్షకులు బాధపడ్డారు. ఇంకా కొంత కాలం పాటు టెలీకాస్ట్ అయితే బాగుండేది అనుకున్నారు. కొంత మంది ప్రేక్షకులు ఏకంగా ఈ సీరియల్ ను మళ్లీ ప్రసారం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. ప్రేక్షకులలో ఈ సీరియల్ పట్ల ఉన్న క్రేజ్ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సీరియల్ కు ఏకంగా సీక్వెల్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సీరియల్ గురించి స్టార్ మా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.  


మార్చి 25 నుంచి ‘కార్తీకదీపం 2‘ ప్రసారం


‘కార్తీకదీపం–ఇది నవ వసంతం’ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నెల 25 నుంచి ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రేక్షకులను అలరించనుంది. ‘కార్తీకదీపం‘ సీక్వెల్ కు మంచి హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీరియల్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ‘కార్తీకదీపం‘ సీరియల్ నటీనటులు నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ సహా మిగతా వాళ్లంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ సీరియల్ బృందం సమాధానాలు చెప్పింది.


కుమారీ ఆంటీపై వంటలక్క ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


నిజానికి ‘కార్తీకదీపం’ సీరియల్ కు సీక్వెల్ వస్తుందని తాము కూడా ఊహించలేదని నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ చెప్పారు. వాస్తవానికి ఈ సీరియల్ లో దీప, కార్తీక్ భార్యాభర్తలు అని భావిస్తారని, కానీ అందులో ఓ ట్విస్టు అందని నిరుపమ్ చెప్పడం సీరియల్ పై ఆసక్తి కలిగిస్తోంది. ఈ సీరియల్ మొదటి నుంచి చివరి వరకు భర్త కోసం పోరాడే మహిళగా తన పాత్రలోని సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా నచ్చుతుందని ప్రేమీ విశ్వనాథ్ చెప్పింది. ఈ సందర్భంగా ‘కార్తీకదీపం’ సీరియల్ అభిమానులు చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే సరికి కుమారి అక్క వచ్చింది వంటలక్కగా..  కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి మా వంటలక్క వచ్చేసింది” అంటూ చేసిన కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొత్తంగా బ్లాక్ బస్టర్ సీరియల్ కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తీక దీపం 2’ ఎలాంటి సక్సెస్ అందుకుటుందో చూడాలి.



Read Also: ఛాన్సుల కోసం క్యారెక్టర్‌ను వదులుకోను, ‘పుష్ప-2’ షూటింగులో నన్ను తోసేశారు - దివి